పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెద్దపేటకు చెందిన ఓ మహిళను... ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అదే ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్ గతేడాది గల్ఫ్‌కు పంపాడు. 2019 జులై 2న ఆమె భర్త.... ఉపాధి కోసం వెళుతున్న తన భార్యను దిల్లీ వరకు వెళ్లి విమానమెక్కించాడు. మొదట కువైట్ అని చెప్పి ఆ తరువాత సదరు మహిళను దుబాయ్‌కు పంపించాడు ఆ ఏజెంట్. మరికొందరితో కలిసి అక్కడ ఓ దుబాయ్ సేఠ్‌కు ఆమెను విక్రయించాలని చూశాడు. ఆమె ఒప్పుకోని కారణంగా తీవ్రంగా హింసించారు. కొన్ని రోజుల తరువాత ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆమెను ఆ దేశంలోని ఏజెంట్లు మస్కట్‌కు పంపారు.
అక్కడా చిత్ర హింసలు
మస్కట్‌లో ఓ వృద్ధుడి ఇంటికి బాధితురాలిని పంపగా అక్కడ ఆమెకు చిత్రహింసలు ఎక్కువయ్యాయి. ఆ ఇంటి యజమాని అయిన ఓ వృద్ధుడు తన పట్ల సైకోలా ప్రవర్తించేవాడని బాధితురాలు తమ బంధువులకు పంపిన ఓ వీడియోలో తెలిపింది. భోజనం పెట్టకుండా లైంగికంగా వేధించేవాడని తమ కుమారులతో కొరికించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ కొన్ని రోజుల పాటు కష్టాలు అనుభవించిన ఆ మహిళ... ఓ పాస్టర్ సాయంతో తప్పించుకుని మస్కట్‌లోని భారత ఎంబసీకి చేరుకుంది. నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. ఆమె పాస్‌పోర్టును ఏజెంట్లు తీసుకున్న కారణంగా.. భారత్‌కు తిరిగిరాలేక అక్కడే ఆశ్రయం పొందుతోంది. ఎంబసీలో ఉన్నప్పటికీ సరైన ఆహారం లేక అవస్థలు పడుతోంది.
సాయం చేయండి
నరకం లాంటి ఆ దేశంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆమెను తిరిగి భారత్‌కు రప్పించాలని బాధితురాలి భర్త, ఆమె తల్లి కోరుతున్నారు. ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో భీమవరం, వీరవాసరం తదితర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది మహిళలను మోసం చేశారని ఆయన తెలిపారు. తన భార్యతో పాటు మిగిలిన వాళ్లను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: