పశ్చిమగోదావరి జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులున్నారు. వాళ్లే 70 శాతం భూములను సాగు చేస్తున్నారు. 2011లో భూ అధీకృత సాగుదారు చట్టం ప్రవేశపెట్టి...ఆ పథకం ద్వారా కౌలురైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసేవారు. ఆ కార్డు పొందాలంటే యజమాని అంగీకారం అవసరం లేకుండా రెవెన్యూ అధికారులే కౌలురైతుల్ని గుర్తించి రుణఅర్హత కార్డులు మంజూరు చేసేవారు.
జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మందికి కౌలురైతుల కార్డులు అందేవి. ఆ కార్డుల ద్వారా పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, విత్తనాల రాయితీ మొదలైనవి పొందేవారు. ఇదే పద్ధతి 2019 వరకూ కొనసాగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత కౌలుదారుల చట్టాలు రద్దు చేసి..2019 పంట సాగుదారు హక్కు చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు-సీసీఆర్‌సీ ఇస్తామని ప్రకటించారు. ఐతే...ఈ సీసీఆర్‌సీ కార్డులు పొందాలంటే..11 నెలలకు సంబంధించిన కౌలుపత్రాలపై..భూ యజమానితో సంతకం చేయించుకోవాలని నిబంధన పెట్టారు. ఐతే..ఆ ఒప్పంద పత్రాలపై ఎక్కువ మంది రైతులు సంతకాలు చేయడం లేదు.
పంట సాగుదారు హక్కు పత్రాలు-సీసీఆర్‌సీ కార్డులు లేకపోవడంతో..పంట రుణాలు, బీమా పరిహారం, విత్తన రాయితీలు మొదలైన ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అందడం లేదు. బంగారం తాకట్టుతో పాటు అప్పులు చేసి పంటలు పండిస్తున్నా..తమ తలరాతలు మారడం లేదని కౌలురైతులు వాపోతున్నారు. పంట సాగుదారు హక్కు పత్రాలు చట్టంలో మార్పులు చేసి.. సీసీఆర్‌సీ కార్డులు ఇప్పించాలని..ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.కౌలు ఒప్పందపత్రాలపై భూ యజమానులుతో సంతకాలు చేయించే బాధ్యత అధికారులే తీసుకొని తమకు న్యాయం చేయాలని..కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: