నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న భారత్ బంద్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. బంద్‌కు రాజకీయ పార్టీలు, రైతుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలపడంతో...జిల్లాలోని ప్రధాన ప్రాంతాలు నిర్మానుశంగా కనిపించాయి. పలు ప్రాంతాల్లో అఖిలపక్ష నేతలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు.
ఏలూరులో
ఏలూరులోని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో భారత్ బంద్‌కు మద్దతుగా రైతు సంఘాలు నిరసన తెలిపారు. కొద్దిసేపు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. భారత్ బంద్‌లో భాగంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ తెదేపా ఎమ్మెల్యేలు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తణుకులో
తణుకులో వామపక్షాలు, బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నరేంద్ర సెంటర్లో నాలుగు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. పట్టణ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ చట్టాలు, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలవరం నియోజకవర్గంలో
పోలవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దుకాణాలు, ప్రభుత్వ- ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జీలుగుమిల్లిలో వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న బంద్