road journey: అడుగడుగునా గుంతలు చాలాచోట్ల పైకి తేలిన కంకర రాళ్లు, ఇనుప చువ్వలు, దట్టంగా కమ్ముకున్న దుమ్ము... ఏమిటిదంతా అనుకుంటున్నారా? ఓ ప్రధాన రహదారి దుస్థితి. ఆ దారిలో వెళ్లాలంటే ప్రయాణికులు సాహసం చేయాల్సిందే. 20 నిమిషాల్లో చేరాల్సిన గమ్యస్థానానికి కనీసం గంటన్నర పడుతుంది. రోడ్డు విస్తరణ పనులంటూ హడావిడి చేసిన అధికారులు, మమ అనిపించి చేతులు దులిపేసుకున్నారు. దీంతో రహదారి మొత్తం అస్తవ్యస్తంగా తయారై. ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది.
ఈ ప్రయాణికుల గోడు ఏ మారుమూల గ్రామాన ఉన్న రోడ్డు గురించో కాదు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వెళ్లే రోడ్డు దుస్థితి గురించి. నిత్యం వేలాది వాహనాలు పరుగులు పెట్టే ఈ దారి ఇంత దారుణంగా ఉందంటే... మిగిలిన రోడ్ల సంగతి చెప్పనవసరం లేదు. పెద్ద గుంతలు, ఇనుప చువ్వలతో ప్రమాదకరంగా మారినా ఎవరికీ పట్టడం లేదు. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కంకర తేలి దుమ్ము రేగుతోంది. అదే వర్షాలు పడ్డాయంటే ఒకటే బురద. ఈ రోడ్డుపైన ఒక్కసారిగా తిరిగిన వాహనాలు షెడ్డుకు, ప్రయాణికులు ఆస్పత్రి బెడ్డుకు వెళ్లక తప్పదు.
కాతేరు నుంచి సీతానగరం వరకు 18.2 కిలోమీటర్ల దూరం రహదారి విస్తరణ పనులు చేపట్టారు. 13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గతేడాది జనవరిలో నిర్మాణాలు ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు తొర్రేడు, బొబ్బిలంక, కాటవరంలో 2 కిలోమీటర్లు మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. రోడ్డు విస్తరణకు ఇంకా 13 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. సీతానగరం, రఘుదేవపురం, జాలిమూడి, కాతేరులో రోడ్డుకు ఇరువైపుల ఆక్రమణలతోపాటు విద్యుత్ స్తంభాలు తొలగించాల్సి ఉండగా... ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదు. దీనివల్ల రోడ్డు పనులు ప్రారంభించి 20 నెలలు దాటినా పూర్తికాకపోవడంతో.. వాహనదారులు అల్లాడిపోతున్నారు.
ఇవీ చదవండి: