జూలై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం పశుసంవర్ధక శాఖ రూపొందించిన కరపత్రాన్నివిజయనగరం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇళ్లలో జంతువులను పెంచే వారంతా వాటి ఆరోగ్యంపై శ్రద్ధచూపడం అవసరమని పేర్కొన్నారు.
జంతువులను పెంచే వారికి వాటి పెంపకం, వాటికి సంక్రమించే వ్యాధులు, పెంపుడు జంతువుల ద్వారా మనకు సంక్రమించే వ్యాధుల పట్ల తగిన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించటం వంటి చర్యల ద్వారా పెంపుడు జంతువులు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. జునోసిస్ దినోత్సవం సందర్భంగా జంతువులకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
పెంపుడు జంతువుల నుంచి మనుషులకు రేబిస్, మెదడువాపు, ఆంథ్రాక్స్, బ్రూసెల్లోసిస్, క్షయ, సాల్మ్ నెల్లోసిన్, లెప్టోస్పైరోసిన్, ప్లేగు, బర్డ్‌ప్లూ వంటి వ్యాధులు సంక్రమిస్తాయని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఏవి.నర్శింహులు చెప్పారు.
జునోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పశువైద్య కేంద్రాల్లో పెంపుడు కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తారని అన్నారు. జిల్లాలో ఉన్న పెంపుడు జంతువులన్నింటికీ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున కరోనా నేపథ్యంలో ఈ జంతువుల యజమానులంతా మొదటి రోజునే టీకాల కోసం ప్రయత్నించకుండా తర్వాతి రోజుల్లో వచ్చి టీకాలు వేయించుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కోట వెనుక ఉన్న బహుళార్ధ పశువైద్య కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీకాలు వేస్తారని తెలిపారు. ఈ సౌకర్యాన్ని పెంపుడు జంతువుల యజమానులు వినియోగించుకొని వాటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి..