విజయనగరం జిల్లా దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. దేవాలయాల భద్రత, రథాల రక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర సమస్యలపైనా సమీక్షించారు. కరోనా నేపథ్యంలో వినూత్నంగా చేపట్టిన ఈ-పూజ, ఈ-హుండి విధానాల అమలు, భక్తుల ఆదరణపైనా చర్చించారు. దూపదీప నైవేద్య పథకం కింద జిల్లాలో 66 ఆలయాలు ఉండగా... అర్హత ఉండి ఈ పథకం కింద వచ్చే వాటి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి చేయాల్సిన ఆలయాల వివరాలను సేకరించాలని సూచించారు.
పార్వతీపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే జోగారావు మంత్రికి విన్నవించారు. బొబ్బిలిలో ప్రాచిన దేవాలయం వేణుగోపాలస్వామి ఆలయ భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు అప్పలనాయుడు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ... జిల్లాల వారీగా దేవాదాయశాఖ అధికారుల సమీక్ష ఉద్దేశాన్ని వివరించారు. రాష్ట్రంలో దేవాలయాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆలయాల భూములు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించటమే కాకుండా... కమర్షియల్ స్థలాలను అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతామన్నారు. రామతీర్థం, అంతర్వేది సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాల పటిష్ఠ భద్రతకు 40 వేల సీసీ కెమెరాలను అమర్చామని మంత్రి తెలియచేశారు. గత ప్రభుత్వం 40 ఆలయాలను కూల్చివేస్తే... జగన్మోహన్ రెడ్డి పునఃనిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారని వెల్లంపల్లి వెల్లడించారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ జిల్లాల వారీగా నిర్వహించ తలపెట్టిన సమీక్షల కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. విజయనగరం జిల్లా నుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లోనూ తితిదే తరపున దేవాలయాలు నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి వెల్లంపల్లికి ఈ సందర్భంగా బొత్స సూచించారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణకు స్థల సేకరణలో ఉన్న సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ రఘురామ.. పోలవరంపై ఫిర్యాదు!