విజయనగరం నగరపాలక సంస్థలో 5వ వార్డు ఉప ఎన్నిక వాగ్వాదాలు, ఉద్రిక్తతల నడుమ ముగిసింది. ఈ స్థానానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి లెంక సూరప్పారావు మృతిచెందడంతో ఎన్నిక వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్ ప్రారంభమైంది. బీఎల్వోలు పంపిణీ చేసిన చీటీలతో ఓటర్లు రాగా ఓట్లు లేవు. దీనిపై పరిశీలనకు వచ్చిన కలెక్టరు హరిజవహర్‌లాల్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఒకటో పోలింగ్ కేంద్రంలో చీటీలతో వెళ్లిన వారికి చుక్కెదురైంది. జాబితాలో పేర్లు గుర్తించడంలో జాప్యం జరగడంతో గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. ఆర్డీవో భవానీప్రసాద్ ఆదేశాలతో సమస్య పరిష్కరించారు. ఓటింగ్ శాతం 54శాతానికిపైగా నమోదైంది.
పోలింగ్ కేంద్రంలో మధ్యాహం వరకు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగింది. 3 గంటల సమయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వాలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. వైకాపా నాయకులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నడిపేన శ్రీనివాసరావు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన తర్వాత వైకాపా, భాజపా అభ్యర్థులు కేంద్రం బయట ప్రచారం చేస్తుండటం మరో వివాదానికి దారి తీసింది. ఇరువర్గాలు తోపులాటల వరకు వెళ్లాయి. రెండో పట్టణ సీఐ శ్రీనివాసరావు, పోలీసు బలగాలు వారిని అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రం బయట ఉన్న అందరినీ పంపించాలని వైకాపా, తెదేపా నాయకులు దూసుకురాగా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదీ చదవండి: