విజయనగరం జిల్లా ఒకటో పట్టణ పరిధిలోని... 21వ డివిజన్ నాగవంశపు వీధిలో భాజపా, వైకాపా వర్గాల ఘర్షణ కేసులో వన్ టౌన్ సీఐ ఎర్రంనాయుడు సస్పెన్షన్‌కు గురయ్యారు. నాగవంశపు వీధిలో జులై13న రాత్రి ఇరు పార్టీల మధ్య కొట్లాట జరిగింది. నాగవంశపు వీధి నుంచి భాజపా తరఫున కార్పొరేటర్‌గా బరిలో ఉన్న కాళ్ల నారాయణరావు వర్గానికి, వైకాపా వర్గానికి మధ్య ఉన్న అంతర్గత విషయాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇరువర్గాల మధ్య జరిగిన కోట్లాటలో నారాయణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన భాజపా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలో... జిల్లా ఎస్పీ రాజకుమారిని కలసి ఫిర్యాదు చేశారు.
ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా కత్తులు, రాడ్లతో భాజపా అభ్యర్థి నారాయణరావుపై వైకాపా వర్గీయులు దాడిచేసి... హతమార్చేందుకు ప్రయత్నించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి నేతృత్వంలో... వైకాపా వర్గీయులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ రాజకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించి... సాక్షులను విచారించారు. ఆ వీధిలో ఎలాంటి ఉద్రిక్తతకు తావు లేకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు.
చర్యలు తప్పవు..
ఎటువంటి వ్యక్తులైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. కోవిడ్ 19 విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం ఇంతటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ప్రధాన బాధ్యులైన ఒకటో పట్టణ సీఐ ఎర్రంనాయుడును సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: