Karthika Masam Special Food : సంస్కృతి అంటే గోదావరి గుర్తొస్తుంది. సంప్రదాయమంటే గోదారి లోగిళ్లే స్ఫురణకు వస్తాయి. గోదారోళ్లు చేసే ప్రతి పనికీ ఓ ప్రత్యేకమైన విధానం ఉంటుంది. అందులోనూ మరి కార్తికమంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఉసిరి చెట్టుకు పూజలు, వన భోజనాల సందళ్ల అబ్బో ఆ తీరే వేరు. అక్కడ వడ్డించే విస్తరి గురించి చెబితే ఎవ్వరికైనా నోరూరాల్సిందే.
ఎక్కడ చూసినా జనంతో నిండిన వనం. పశ్చిమ వనసమారాధనలో వడ్డించే వంటలన్నీ ఘనం. అరమీటరుకు పైగా ఉన్న అరటాకును అడ్డ విస్తరిగా పరిచి, నోరు ఊరేటట్టు ముందుగా వడ్డించే నేతిబొబ్బట్టు, దాని పక్కన బూరుగుపల్లి బెల్లంతో చేసిన బూరి, కారం తగిలీ తగలనట్టుగా ఉండే వాము బజ్జీ మొదటి వరుసలో వడ్డిస్తారు. మంచీ చెడ్డ ఆలకిస్తూనే అతిథులు శ్రద్ధగా వీటిని ఆరగిస్తారు.
ఆ తర్వాత ఆవ పెట్టిన పులిహోర, కమ్మని కొబ్బరన్నం కొసరి కొసరి కొత్తిమీర రైసు వడ్డిస్తుంటే భోజన ప్రియుల్లో కన్నార్పని జిహ్వచాపల్యం శివతాండవమాడుతుందంటే అతిశయోక్తి కాదు. దోసకాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, మామిడితోటి కలిపి చేసిన కొబ్బరి రోటి పచ్చడి నోటికి తగలగానే పళ్లు వాటంతటవే కదులుతూ వేడి అన్నంతో కలిపి కుమ్ముతాయి. కందిపొడి, కరివేపాకు పొడివంటి వంటకాలపై కమ్మని నెయ్యి వడ్డిస్తుంటే ఇంకొంచెం వెయ్యి అనుకుండా ఉండలేరు సుమీ.
కార్తిక విస్తరి : కార్తిక భోజనమంటే ఉమ్మడి పశ్చిమలో కందాబచ్చలి కూర తప్పకుండా ఉండాల్సిందే. మెత్తగా మెదిపిన కందతో ఉడకబెట్టిన బచ్చలి ఆకు కలపి చేసిన కూర చలికాలంలో మరింత పసందుగా ఉంటుంది. వేపుడు చేసిన పనసపొట్టు కూరను ప్రతివారు ఓపట్టు పట్టాల్సిందే. కూరలన్నింటా ఈ కూర తయారీకే అత్యధిక సమయం శ్రమ అవసరమవుతుంది. తినేటప్పుడు వండినవారు సైతం శ్రమను మరిపించేలా పనసపొట్టు రుచితో మురిపిస్తుంది.
నాలుక చేసుకున్న పుణ్యఫలం గుమ్మడికాయ దప్పలం వడ్డించుకుని వేడి అప్పడం నంజుకుంటే తృప్తి మరింత పుంజుకుంటుంది. దప్పలంలో పప్పు కలుపుకున్నా నప్పుతుంది. వేయించిన ముక్కల ఒడియాలు మజ్జిగ పులుసులో మచ్చిక చేసుకుని లాగిస్తుంటే ఆ మజాయే వేరబ్బ. గోదావరి లంకల్లో పండిన అరటి పండును ఆఖరిలో అరచేతబట్టి ముంత పెరుగును జుర్రుకుంటుంటే సంతృప్తి పతాక స్థాయిలో రెపరెపలాడేలా కార్తిక విస్తరి ఆహా అనిపిస్తుంది. గోదారి లంక తమల పాకులతో అందించే తాంబూళం కొసమెరుపు మరిచిపోలేము.