ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నిరసనలు, రైతు సంఘం, ధర్నాలు, ఆందోళనతో విజయనగరం జిల్లా కలెక్టరేట్ హోరెత్తిపోయింది. పలు సమస్యలపై ఆయా సంఘాలు కలెక్టరేట్ ముందు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా పరిసర ప్రాంతమంతా జనసందోహంగా మారిపోయింది. ఆందోళనకారులు, వారిని నిలువరించేందుకు బందోబస్తు నిర్వహించిన పోలీసులతో కిటకిటలాడింది. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ సేవలకు జిల్లా సంఘం, పలు సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రధానంగా కనీస వేతనాన్ని పెంచాలని.. నామినీలను శ్వాశత ఉద్యోగులుగా గుర్తించాలని.. కోత విధించిన డీఏను చెల్లించాలని డిమాండ్ చేసారు.
అదేవిధంగా రక్షణ రంగ పరిశ్రమను ప్రైవేటీకరించే ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని.. ఆ రంగం ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఏఐటీయూసీ నిరసన చేపట్టింది.
ఇక.. ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించాలనే పార్టీ అధిష్టానం పిలుపు మేరకు.. జనసేన పార్టీ నేతలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. రబీ ధాన్యానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని.. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని జనసైనికులు హెచ్చరించారు.
వీరితో పాటు.. విజయనగరం మండలం కొండకరకం గ్రామస్థులు.. వీఎంఆర్డీఏ నూతన మాస్టార్ ప్రణాళికను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వీఎంఆర్డీఏ ప్లాన్ లో పారిశ్రామిక ప్రాంతంగా పేర్కొంటున్న కొండకరం భూములను తొలగించాలని స్థానికులు ఆందోళన చేశారు. వీఎంఆర్డీఏ తాజా 2041ప్రణాళిక ప్రకారం.. తమ గ్రామంలోని విలువైన భవనాలనే కాకుండా.. వ్యవసాయ భూములనూ కోల్పోయే ప్రమాదం ఉందని వారు వాపోయారు. ఈ కారణంగా సంబంధిత అధికారులు ఆ ప్రణాళిక ప్రతిపాదనలను పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. Raghurama letter: 'నాపై ఎంపీ విజయసాయి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు'