శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలో నమోదైన కేసులు ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్ని పునఃసమీక్షించుకోవాలనే సంకేతాలిస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన యువకునికి కరోనా నెగిటివ్ ఫలితం వచ్చినా.. అతనితో కలిసి ఒకే ఇంట్లో గడిపిన ముగ్గురికి పాజిటివ్ రావడం ఆందోళనకు దారి తీస్తోంది.
బయట ప్రాంతాల నుంచి విజయనగరానికి వచ్చిన వలస జీవులకు పరీక్షలు నిర్వహించి, నెగెటివ్‌గా ఫలితం వచ్చిన తర్వాత వారికి ఇళ్లకు పంపిస్తున్నారు. గృహ నిర్బంధంలో ఉండాలని చెబుతున్నారు. ఇప్పుడు అలా చెప్పేందుకు వీలులేని పరిస్థితులు నెలకొన్నాయి. వలస జీవులు ఎవరైనా జిల్లాలో ప్రవేశిస్తే వారిని క్వారంటైన్‌కే పరిమితం చేయాలనే సూచనను పక్క జిల్లా అనుభవం చెబుతోంది.
ఏం చేయాలి...
● విజయనగరం జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు కేంద్రాల్లో క్వారంటైన్లు ఏర్పాటు చేశారు. వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొనే దిశగా చర్యలు ప్రారంభం కావాలి.
● సరిహద్దు కేంద్రాల వద్ద ఇతర జిల్లాల నుంచి రాకపోకలపై అనుసరిస్తున్న విధానాన్ని పునఃసమీక్షించుకోవాలి. రాకపోకలను నిలిపివేయాలి.
● తనిఖీ కేంద్రాల వద్దే ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించారు. విజయనగరం వై కూడలి వద్ద ఈ ఏర్పాట్లు చేశారు. అన్ని సరిహద్దుల్లో ఇవి జరగాలి.
● సరిహద్దుల్లోని తనిఖీ కేంద్రాల్లో ఫలితంతో సంబంధం లేకుండా వచ్చిన వారిని గృహనిర్బంధంలో కాక ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని.. 14 రోజుల తర్వాత వారిపై నిఘా ఉంచాలని పలువురు సూచిస్తున్నారు.
● లాక్‌డౌన్ తర్వాత జిల్లాకు దాదాపు 40 వేల మంది వలస కూలీలు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. వీరికి తనిఖీ కేంద్రాల వద్దే పరీక్షలు జరిపి క్వారంటైన్‌కు పంపడం సురక్షితమని కొందరి అధికారుల భావన.
ఏం జరుగుతోంది..
● జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలకు 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినా వాటిని దాటుకొని అనేకమంది జిల్లాలో ప్రవేశిస్తూనే ఉన్నారు.. రాత్రివేళలను ఇందుకు ఎంచుకుంటున్నారు. ఇందులో ఎక్కువ కేసులున్న చోటు నుంచి వచ్చిన వారే అధికం. రోజూ ఇటువంటి వారు బయటపడుతూనే ఉన్నారు.
● విశాఖలో ఎక్కువ కేసులు ఉండటంతో పలు ప్రాంతాలను రెడ్‌జోన్లు చేశారు. అటువంటి చోట్ల నుంచి కూడా జిల్లాకు చెందిన ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు. విధి నిర్వహణ పేరుతో పోలీసులకు చెప్పి వచ్చేస్తున్నారు.
● అనుమతించిన సమయంలో అంటే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. భౌతిక దూరం చాలామంది పట్టించుకోవడం లేదు.
● కొందరు అధికారులు జిల్లాకు ఇటీవల బదిలీపై కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చారు. వీరిని కలవడానికి, కలసి విధులు నిర్వహించడానికి ఉద్యోగులు భయపడుతున్నారు.
● ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఉంటూ జిల్లాకు వచ్చిన వారు సుమారు 8 వేల మంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి 431 మంది వచ్చారు. వీరందరికీ హోం క్వారంటైన్ పూర్తయినా మళ్లీ వీరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పరీక్షలు చేయడం ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు.
కదలికలపై ఆరా..
శ్రీకాకుళం పాతపాట్నంలో వెలుగు చూసిన కరోనా కేసులకు కారకుడయ్యాడని చెబుతున్న వ్యక్తి విజయనగరం జిల్లాలోనూ సంచరించాడా అన్న కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక్కడ అతని బంధువులు, స్నేహితుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ వ్యక్తి ప్రయాణం చేసిన బోగిలో జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులున్నట్లు తాజాగా గుర్తించారు. ఇందులో ఇద్దరు జిల్లాలో లేరని, ఒకరు మాత్రమే ఉన్నారని, అయితే ఈ ముగ్గురిలో కరోనా లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: