Nadendla Manohar Inspected Rice Mills: పల్నాడు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో పలువురు మిల్లులకు తాళాలు వేసుకుని పరార్ అయ్యారు. అయితే మిల్లుకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి చూసిన అధికారులు, మంత్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని చూసి షాక్ అయ్యారు.
కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా భారీగా అక్రమ రేషన్ నిల్వలు బయటపడ్డాయి. సత్తెనపల్లిలోని పలు రైస్ మిల్లుల్లో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత మంత్రి మనోహర్ అచ్చంపేట రైల్వే గేటు దగ్గర ఉన్న ఆంజనేయ ట్రేడర్స్ రైస్ మిల్లుని పరిశీలించేందుకు వెళ్లారు. అయితే మంత్రి తనిఖీలకు వస్తున్నారనే సమాచారాన్ని యాజమాన్యం ముందుగానే తెలుసుకుంది. దీంతో మిల్లుకు తాళాలు వేసి యాజమాన్యం పరార్ కాగా, తహసీల్దార్ సమక్షంలో మిల్లు తాళాలు పగలగొట్టి మంత్రి తనిఖీలు నిర్వహించారు.
ఆశ్చర్యపోయిన మంత్రి నాదెండ్ల: మిల్లులో భారీగా రేషన్ బియ్యం నిల్వ ఉండటంతో మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిల్లులో భారీ స్థాయిలో అక్రమ రేషన్ నిల్వలుంటే తహసీల్దార్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేయకుండా ఏం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
తనిఖీల నేపథ్యంలో మిల్లుకు సంబంధించిన పలు పత్రాలను సిబ్బంది దహనం చేయడాన్ని మంత్రి, అధికారులు గుర్తించారు. అనంతరం పిడుగురాళ్ల రోడ్డులో ఉన్న మూడు రైస్ మిల్లులను మంత్రి మనోహర్ పరిశీలించారు. ఆ తరువాత కొమెరపూడిలోని రైసు మిల్లులోనూ తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే మాఫియా మీద కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ హెచ్చరించారు.
ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు: నాదెండ్ల మనోహర్