Jagan Will not Attend to Assembly Session: ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తోంది. అంతేకాకుండా పలు పనులపై కమిటీలు వేసి నిజనిజాలు బహిర్గతం చేస్తోంది. ఇదే సమయంలో ఆనాడు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసిన, నేతలపై అసభ్యకరంగా పోస్టులు చేసిన వారి భరతం పడుతోంది.
తాజాగా హోంమంత్రి అనిత అలాంటి ఆరోపణలు చేసినవారు ఎక్కడున్నా పట్టుకువచ్చి మరీ శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొంతమంది ఎస్పీలు వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని ఘాటుగా స్పందించారు. దాని తర్వాత పోలీసుల తీరులో మార్పు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇదిలావుండగా ఇదే అంశంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్పందించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఇప్పటి వరకు 101 మందిపై కేసులు పెట్టారని ఆరోపించారు. అలాగే అసెంబ్లీ సమావేశాలపైనే మాట్లాడారు.
నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. మైక్ ఇస్తే కట్ చేస్తారు. ఎమ్మెల్యేలాగా రెండు నిమిషాలు మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు. అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో ప్రతిరోజూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై మాట్లాడతా. -వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అధినేత
మరోవైపు డీజీపీ అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పని చేయలేదని మాట్లాడుతున్నారని చెబుతూ డీజీపీ దిగజారి వ్యవహరిస్తున్నారన్నారని ఆక్షేపించారు. లా అండ్ ఆర్డర్ రక్షణలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఘోరంగా విఫలమైందన్నారు. కేవలం 5 నెల్లలో 91 మంది మహిళలు, పిల్లలపై అత్యాచారాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం మాట్లాడారంటే ఆశ్ఛర్యం కల్గిస్తోందన్న జగన్, లా అండ్ ఆర్డర్ సీఎం వద్ద ఉండగా ఆయన్ను ప్రశ్నించే ధైర్యం లేక దళిత హోం మంత్రిపై మాట్లాడుతున్నారన్నారు.
సిమెంట్ ప్లాంట్ పెట్టేందుకు సరస్వతి పవర్ పేరిట భూములను తీసుకున్నామని, అక్టోబర్ 26 లోకల్ ఎమ్మార్వో భూములను పరిశీలించి వెయ్యి పైగా ఎకరాలన్నీ పట్టా భూములే అని చెప్పారన్నారు. సరస్వతి పవర్ కోసం కొన్న భూములన్నీ పట్టాభూములేనని స్థానిక ఎమ్మార్వో స్పష్టంగా చెప్పారన్నారు. కేవలం 4 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉందని అది కూడా కొండలు, చుక్కల భూములు ఉన్నాయని ఎమ్మార్వోనే చెప్పారని జగన్ అన్నారు.
అసెంబ్లీకి రావాలని ఎవరూ ఆహ్వానించరు? : జగన్ హయాంలో గౌతు శిరీష, రంగనాయకమ్మను అరెస్టు చేశారని హోంమంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు జగన్కు నోటీసులు, వారంట్లు గుర్తుకు వస్తున్నాయా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను అసెంబ్లీ సమావేశాలకు రావాలని ఎవరూ ఆహ్వానించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడాలన్న ఆలోచన ఆ ఎమ్మెల్యేకు ఉండాలని, బాధ్యతలేని వారు ఇంట్లో కూర్చుంటారని స్పష్టం చేశారు.