కరోనా వ్యాధితో ఏ ఒక్కరు మరణించకుండా చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా వ్యాధి నియంత్రణకు మూడు సూత్రాలను ప్రతి ఒక్కరు పాటించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎంపీడీఓలు, మునిసిపల్ కమీషనర్లకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించడం, బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, కార్యాలయాల్లో ఇతరుల నుంచి కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటించటం, తరచుగా చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకోవటం వంటి మూడు అంశాలను పాటించేలా మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
కరోనా లక్షణాలు ఉన్న వారు స్వచ్చందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొనేందుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచితంగా మాస్క్‌లు పంపిణీ చేశామని, అందువల్ల మాస్క్ ధరించని వారికి అపరాధ రుసుము విధిస్తామన్నారు. ఇతర పద్ధతుల ద్వారా మాస్క్ వినియోగించడాన్ని అలవాటుగా చేయాలన్నారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 62.14 లక్షల మాస్క్ లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 29 మండలాల్లో పూర్తి చేశామన్నారు. పాచిపెంట, రామభద్రపురం, సీతానగరం, మక్కువ, సాలూరు తదితర ఐదు మండలాల్లో మాత్రమే మిగిలి ఉందని డీఆర్డీఏ పథక సంచాలకులు సుబ్బారావు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 60.03 లక్షల మాస్క్ లు పంపిణీ చేసామన్నారు. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, నగరాల్లో మాస్క్‌ల పంపిణీ పూర్తి చేశామని మెప్మా పీడీ సుగుణాకర్ చెప్పారు. మాస్క్‌ల పంపిణీ సమర్ధవంతంగా చేపట్టిన ఎంపీడీఓలను జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) ఆర్.కుర్మనాథ్ అభినందించారు. జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: 'భోగాపురం విమానాశ్రయ భూసేకరణ త్వరగా పూర్తిచేయాలి'