కేంద్రం, రాష్ట్రంలో చట్టసభలు మాదిరిగానే పంచాయతీల్లో గ్రామసభలు ఎంతో కీలకమైనవి. అందుకే వీటిని మినీ పార్లమెంట్/అసెంబ్లీగా పేర్కొంటారు. పంచాయతీల్లో ఏటా నాలుగుసార్లు వీటిని నిర్వహించాలి. రెండుసార్లు మాత్రం తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనలు చెబుతున్నాయి.
నిర్వహించకపోతే ..
సభ నిర్వహించకపోతే పంచాయతీరాజ్ చట్టం 20ఎ ప్రకారం సర్పంచి తన పదవిని కోల్పోతాడు. పదవిని కోల్పోయిన తేదీ నుంచి సంవత్సరం పాటు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా పరిగణిస్తారు.
చర్చించే అంశాలివే:
అభివృద్ధి ప్రణాళిక, బడ్జెట్ అంచనాలు, పన్నుల బాకీలు, కొత్తగా పన్నులు విధించడం. ఉన్న పన్నుల పెంపు ప్రతిపాదనలు, ఆదాయ వ్యయాల ఆడిట్ నివేదిక, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక
నిర్వహించాల్సిన తేదీలు
ఏప్రిల్14, అక్టోబరు 03, జనవరి 02, జులై 01, ఇవి కాకుండా సభ్యుల్లో 50 మంది లేదా పదిశాతం ప్రజలు రాతపూర్వకంగా కోరినా నిర్వహించాలి. ఓటుహక్కు ఉంటే సభ్యులే. పంచాయతీలో ఓటుహక్కు కలిగిన వారంతా సభ్యులే. సభ నిర్వహించే తేదీ, సమయం రెండు రోజుల ముందు నోటీసు ద్వారా ప్రజలకు తెలియజేయాలి. దండోరా, కార్యాలయం నోటీసుబోర్డులో ప్రదర్శించాలి. పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ గ్రామాలుంటే రొటేషన్ పద్ధతిలో సభలు నిర్వహించాలి. అందరికీ అనువైన ప్రదేశంలోనే గ్రామసభ నిర్వహించాలి. సూర్యోదయం తరువాత ప్రారంభించి సూర్యాస్తమయంలోపే ముగించాలి. పంచాయతీస్థాయిలో ఉండే ప్రభుత్వ అధికారులందరూ సమావేశానికి హాజరుకావాలి. సభ నిర్వహణ తెలియజేసేందుకు ఎజెండా, సమావేశం నిర్వహణ నమోదుకు మినిట్సు రిజిస్టర్, సభ్యుల సంతకాలకు హాజరు రిజిస్టర్లను నిర్వహించాలి.
జిల్లాలో పరిస్థితి:
జిల్లాలో గ్రామసభలు నామమాత్రమవుతున్నాయనే విమర్శ నెలకొంది. సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక పలుమార్లు వీటి నిర్వహణలో లోపాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానంగా సభలకు హాజరయ్యే కొద్దిపాటి ప్రజలిచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో నమ్మకం పోతుందన్న ప్రచారం వినిపిస్తోంది. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరుకాకపోయినా వీరికి జిల్లాలో నోటీసులిచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా చట్టసభలు తరహాలో నిర్వహించడం ద్వారా ప్రజలకు మేలుకలుగుతుందని పలువురు సూచిస్తున్నారు.
జిల్లాలో పంచాయతీలు -960
●గ్రామసభలో సభ్యులు- 18,95,099 (2020 ముసాయిదా)
మహిళలు- 9,61,464
పురుషులు- 9,33,495
ఇతరులు - 140
గ్రామస్థాయి అధికారులు- 17
ఇవీ చూడండి...