ఏఐఎఫ్ పథకం కింద జిల్లాలో రైతాంగానికి భారీ ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు తగిన సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, రైతు భరోసా) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వివిధ వ్యవసాయ, అనుబంధ శాఖలు, బ్యాంకు అధికారులతో తన ఛాంబర్‌లో మంగళవారం ఏఐఎఫ్ పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పథకం అమలులో బ్యాంకులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు.
కోత అనంతరం, సరైన సమయంలో విక్రయించేందుకు అనువుగా పంటను నిల్వచేసుకోవడానికి, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడానికి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ తదితర సదుపాయాలను కల్పించడానికి కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని చెప్పారు. పథకాన్ని సకాలంలో, సక్రమంగా ఉపయోగించుకోగలిగితే జిల్లాకు సుమారు రూ.500 కోట్లు వరకూ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లాలో పథకాన్ని అమలు చేయడానికి విభిన్నంగా, వినూత్నంగా కొత్త యూనిట్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కేవలం వ్యవసాయానికే కాకుండా, ఉద్యాన, పాడి, మత్స్య, పట్టు, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల్లో కూడా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి... అంతిమంగా రైతుకు మేలు చేసేందుకు కృషి చేయాలని జేసీ కోరారు.
ఇదీ చదవండి: