విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో సీతాఫలం పండిస్తున్నారు. ఏటా సుమారు 12 వేల టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. ప్రకృతి సిద్ధంగా పండటం, మంచి పరిమాణం, రుచికరంగా ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 80 నుంచి 100 కాయలు ఉండే గంపను రూ.300 నుంచి 350కు విక్రయిస్తున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట ప్రాంతాల్లోని గూడేల్లోని వారపు సంతల్లో వీటిని అమ్ముతున్నారు.
ఆదాయం వస్తున్నప్పటికీ... శ్రమదోపిడికి గురవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు వీరి నుంచి తక్కువ ధరకు పండ్లు కొనుగోలు చేసి, రెండు, మూడింతలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కోసారి సిండికేట్గా మారి ధరను నిర్ణయించి గిరిజనులను మోసం చేస్తున్నారు. సీతాఫలాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే మంచి ధర వస్తుందని గిరిజన సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులు దళారులను నియంత్రించి, గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఎంతో కష్టపడి సీతాఫలాలు సేకరించినప్పటికీ మాకు సరైన గుర్తింపు రావడం లేదు. దళారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వారే ధరను నిర్ణయిస్తున్నారు. దీంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాం. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.
-గిరిజనుడు
ఇదీచదవండి.