గిరిజనులు ఐకమత్యంతో రహదారులను బాగు చేసుకుంటున్నారు. ఇంకా చాలాచోట్ల అనుసంధాన రహదారులు లేకపోవడంతో వారికి కష్టాలు తప్పడం లేదు. అధికారులు, రాజకీయ నాయకులు అప్పటికప్పుడు హామీలు గుప్పించి వెళ్లిపోతున్నారు. మళ్లీ వాటి అమలును పట్టించుకోవడం లేదు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని 91 గిరిజన గ్రామాలకు అనుసంధాన రహదారులు లేవు. కొదమ, చింతామల, సిరివర ప్రజలు సొంత డబ్బులతో గతేడాది జులై, ఆగస్టులో రహదారులు నిర్మించుకున్నారు. దీనిపై సినీనటుడు సోనూసూద్ ట్విటర్‌లో స్పందించడంతో కొదమ పంచాయతీ పేరు దేశవ్యాప్తంగా మారు మోగింది. సెప్టెంబరు 10న ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఇంజినీరింగ్ అధికారులు పర్యటించి పదిరోజుల్లో రహదారి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఒడిశా సరిహద్దు చింతామలలో పనులు మొదలుపెట్టారు కానీ 120 రోజులు పూర్తయినా కొదమలో పనులు మొదలుకాలేదు. దీంతో ఆగ్రహించిన ఆ గ్రామస్థులు ఎమ్మెల్యే రాజన్నదొరను కలసి గోడును విన్నవించుకున్నారు.
70 రోజుల్లో గ్రామానికి దారి వేయిస్తామని ఆయన చెప్పారు. 120 రోజులైనా వేయకపోవడంతో పనులు ప్రారంభించే వరకు ఆయన ఇంటివద్దే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తామని స్థానికులు చెప్పారు. అటవీ అనుమతుల కోసం అధికారులు పంపిన దస్త్రాల్లో తప్పులు దొర్లటంతో ఆలస్యమైందని, మార్చి వరకు గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పి పంపించారు.
* గిరిజనులు సొంత నిధులు ఖర్చు చేసి గతేడాది ఆగస్టులో సాలూరు మండలంలోని కొదమ నుంచి బారి గ్రామానికి రహదారి నిర్మించారు. ఈ పనులు దేశానికే ఆదర్శమని అప్పట్లో సినీ నటుడు సోనూసూద్ ట్విటర్‌లో స్పందించారు కూడా. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాన్ని సందర్శించి, హామీలు ఇచ్చారు. అవి నేటికీ అమలవ్వక ఆ దారి అభివృద్ధికి నోచుకోలేదు.
ఇదీ పరిస్థితి..
ప్రస్తుతం నంద నుంచి పగులుచెన్నూరుకు 6.35 కిలోమీటర్ల దారి నిర్మాణాన్ని రూ.5.5 కోట్లతో ప్రారంభించారు. 2018 డిసెంబరులో అటవీశాఖ అనుమతుల కోసం ప్రయత్నించగా ఏడాది 9 నెలలకు వచ్చాయి. పగులుచెన్నూరు కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఉన్నా అధికారులు అనుమతులు సాధించారు.. నంద నుంచి కొదమకు బీటీ రోడ్డు వేసేందుకు 2019 జులైలో నిధులు మంజూరయ్యాయి. మొత్తం 10.8 కిలోమీటర్ల మేర రహదారికి రూ.11.32 కోట్లు అందించారు. దీనికి టెండర్లు పూర్తయినా అటవీ అనుమతులు లేక పనులు ప్రారంభించలేదు.
ఇప్పటికైనా వచ్చేనా..
కొదమకే కాదు.. పర్యాటక ప్రాంతం శిఖపరువు, కొఠియా వివాదాస్పద గ్రామాలు ఎగువశెంబి, దిగువశెంబిని తోణాంకు, కరడవలసకు నిధులు మంజూరయ్యాయి. వీటి నిర్మాణాలకు అటవీ అనుమతులు రాకపోవడమే ప్రధాన కారణమని ఎమ్మెల్యే పలుమార్లు చెప్పారు. ఈ లోపు ఆ ప్రాంతాల్లో ప్రత్యేకించి కొఠియా వివాదాస్పద గ్రామాల్లోకి ఒడిశా ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు లేకుండా బీటీ రహదార్లు వేసుకుంటోంది. దీనిపై గిరిజనులు అడిగిన ప్రశ్నలకు మాత్రం అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. దశాబ్దాల కాలంగా రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేస్తున్నా సాంకేతిక కారణాలు, సాకులు చూపుతూ పనులు చేయడం లేదు. ఈ సారైనా కొదమ పంచాయతీ గిరిజనులకు దారి చూపుతారో లేదో చూడాలి.
"గిరిజన గ్రామాల్లో రోడ్లు వేసేందుకు అటవీ అనుమతులు అవసరం. అవి రాకపోవడంతో నియోజకవర్గంలో రహదారులు వేయలేకపోతున్నాం. దీంతో వచ్చిన నిధులూ వెనక్కి పోతున్నాయి. అందుకే ఈ సారి నేనే స్వయంగా వెళ్లి అనుమతులను తెస్తాను. మూడు నెలల్లో పనులన్నీ ప్రారంభించేలా చర్యలు చేపడతా." - పి.రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు.
"రహదారులను అటవీ ప్రాంతంలో వేయనున్నారు. అందువల్ల నిబంధనల మేరకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. దీనికోసం ఇప్పటికే దస్త్రాన్ని పంపించాం. లోపాలున్నాయని ఒకసారి వెనక్కి పంపించేశారు. మళ్లీ సరిచేసి అందించాం. త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉంది." - కె.రామారావు, ఫారెస్ట్ రేంజర్, సాలూరు.
ఇదీ చదవండి: కన్వర్జెన్స్ పనుల నిర్వహణలో సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి బొత్స