విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఎస్సీ మరువాడ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పారయ్య, పండయ్య చిన్నతోలు మండగూడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు భూషణ్‌రావు సోమవారం సాయంత్రం పనులు నిమిత్తం పొలానికి వెళ్లారు. ఈలోపు వర్షం పడడడంతో సమీపంలో ఉన్న పాకలో తలదాచుకున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులు పడడంతో అక్కడికక్కడే ముగ్గురు కుప్పకూలిపోయారు.
వీరితో పాటు ఉన్న పండయ్య భార్య, పాప స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపటికి మెలుకువ రావడంతో ముగ్గురినీ పాక లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ విషయం సమీపంలో ఉన్న గ్రామస్థులకు తెలియజేశారు. వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ ముగ్గురూ అప్పటికే మరణించినట్లు గుర్తించారు.
చినమేరంగి ఇన్‌ఛార్జ్ ఎస్సై శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.