ప్రయివేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారి ఫీజుల రద్దు అన్యాయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. వేలాది మంది ఎస్టీ విద్యార్థులు చదువుకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్ధుల ఫీజులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం సరికాదని హితవు పలికారు.
గత ప్రభుత్వం.. చదువులో ప్రతిభ కనబరచిన గిరిజన విద్యార్థులను ప్రైయివేట్ పాఠశాలల్లో చేర్పించి, ఫీజులు కట్టి, వారిని ప్రోత్సహించే పథకాన్ని అమలు చేస్తే... ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసి, గిరిజనులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. యథావిధిగా అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి.. గిరిజనుల అభివృద్ధికి సంబంధించిన తీర్మానం చేసి అమలు చేయాలని చెప్పారు. కాని తాము తప్పులను నిలదీస్తామని భయపడి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సమావేశాలే ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: నిత్యావసరమే.. అత్యవసరంగా పొదుపుచేయాల్సిందే..