రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తోన్న పాఠశాలల్లో ప్రత్యేక అధికారులు తనిఖీలు చేశారు. విజయనగరం జిల్లాలో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో 24 స్కూళ్లలో సోదాలు చేశారు. విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలిలో అధికారుల బృందాలు వేర్వేరుగా దాడులు నిర్వహించారు. రుసుములకు సంబంధించిన దస్త్రాలతో పాటు ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలల యాజమాన్యాలతో పాటు... విద్యార్థుల తల్లిదండ్రులను అధికారులు విచారించారు.
అనంతపురంలోనూ తనిఖీలు
అనంతపురం జిల్లాలో వివిధ పాఠశాలల్లో 10 బృందాలుగా ఏర్పడి విద్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. అధిక ఫీజుల విషయంలో పాఠశాలల వైఖరి పట్ల పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ఈశ్వరయ్య అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.