పార్వతీపురం మండలం అడారుగెడ్డ మినీ జలాశయం
విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజనులో చిన్ననీటి వనరులను అభివృద్ధి చేసే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. రూ.500 కోట్లు ఖర్చు చేస్తే ఆగిన పథకాలను పూర్తి చేయొచ్చునని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా పనులు నిలిచిపోవడానికి కారణాలు ఏమిటని చర్చించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్న కాలంలో టీఎస్పీ నిధులతో పనులు మంజూరయ్యాయి. వాటిని చేయడానికి ముందుకు వెళ్దామంటే అవసరమైన మేర భూమి లేదు. దీంతో ఈ పనులు జరగక....పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.
మధ్యలోనే వదిలేయడంతో....: పథకాల పూర్తికి అవసరమైన భూమిని గుత్తేదార్లకు అందించలేకపోవడం వల్ల చాలా పనులను వారు మధ్యలోనే విడిచి వెళ్తున్నారు. 15 ఏళ్లుగా నిలిచిన వాటి ప్రారంభానికి అడ్డంకిగా ఉన్న భూసేకరణను తొలుత పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సర్వే, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. దీంతో సబ్‌కలెక్టరు విధేఖరే డివిజనులోని చిన్ననీటి పథకాలను సందర్శించి, తహసీల్దార్లకు పలు సూచనలు చేశారు.
వెనుకంజ: వనకాబడి గెడ్డ మినీ రిజర్వాయరుగా మలిచే పనులు పూర్తిగా నిలిచిపోయినట్లేనని భావిస్తున్నారు. దీని ఆయకట్టుగా గుర్తించిన భూములు కోటిపాం థర్మల్ పవర్ ప్లాంటు స్థలాల్లో కలిపేశారు. నిర్మాణ వ్యయం భారీగా రూ.45 కోట్లకు పెరగడంతో రిజర్వాయరు ప్రస్తావనే లేకుండా పోయింది.
ఏడాదిలో పూర్తికి నిర్ణయం: భూసేకరణ పూర్తి చేసిన తర్వాత పనులకు సంబంధించి అవసరమైన నిధులకు చర్యలు ప్రారంభమవుతాయి. స్వయంగా కలెక్టరు భూసేకరణ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. సేకరణ పూర్తయితే అసలు పని మొదలవుతుందని భావిస్తున్నాం.
- ఆర్.అప్పలనాయుడు, కార్యనిర్వాహక ఇంజినీరు, జలవనరులశాఖ
వివిధ స్థాయిల్లో ....: ●అడారుగెడ్డకు సేకరించాల్సిన భూమికి సంబంధించి రెవెన్యూశాఖకు జలవనరుల శాఖ ఇటీవలే ల్యాండ్‌ప్లాన్ షెడ్యూల్‌ను ఇచ్చింది. రెవెన్యూశాఖ దృష్టి సారించాల్సి ఉంది.● దళాయివలస వద్ద పెద్దగెడ్డ పనులకు 6.31 ఎకరాలు సేకరించేందుకు జలవనరుల శాఖ ప్రణాళిక వేసింది. ● రేగిడిగెడ్డ పనులకు భూసేకరణ పూర్తయ్యింది. బకాయి ఉంది. ● మిగిలిన పథకాలకు సంబంధించి కూడా వేగంగా పనులు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.