ఆరు నెలలుగా జీతాలు అందడం లేదని ఆరోపిస్తూ.. విజయనగరం జిల్లా శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం పట్టణంలో భిక్షాటన చేపట్టారు. జీతాలు చెల్లించాలని కోరుతూ... గత 20 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటు ఆస్పత్రి అధికారులు గాని అటు కాంట్రాక్టర్ గాని స్పందించడం లేదని కార్మికులు వాపోతున్నారు.
ఆరు నెలల వేతనాలు బకాయిలు ఉండగా ఒక నెల వేతనం ఇస్తామని... నచ్చితే పని చేయండి లేకపోతే మానేయండి అంటూ కాంట్రాక్టర్ చెబుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు విధి లేక కార్మికులు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలో భిక్షాటనకు దిగారు. పుణ్యగిరి మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తుల వద్ద భిక్షాటన చేశారు. ఇదే సమయంలో ఈ మార్గంలో వస్తున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావు కారును అడ్డుకున్నారు.
ఆరు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకు తమ గోడు విన్నవించుకోగా... పరిశీలిస్తామని చెప్పి ఆయన వెళ్లిపోయారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ.. కార్మికులకు ఆరు నెలల పాటు వేతనాలు లేకుండా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. ఇకపై ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: