తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్లిన భార్యను తీసుకువచ్చేందుకు బయలుదేరిన భర్త మృత్యు ఒడికి చేరుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన చింతపల్లి సూర్యనారాయణ భార్య రమాదేవి.. చింతలవలసలో ఉన్న తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఆదివారం వెళ్లారు. ఆమెను తీసుకువచ్చేందుకు సోమవారం సాయంత్రం పోలిపల్లి నుంచి సూర్యనారాయణ ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఏరావివలస కూడలి వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో సూర్యనారాయణ వాహనం అదుపుతప్పి పక్కనున్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. 2 పల్టీలు కొట్టి తల, ముఖం పై ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కూలి పని చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సూర్యనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: లెబనాన్ రాజధానిలో భారీ పేలుడు- 73 మంది మృతి