Pregnant Dormitories in Agency Areas: కొండలు, గుట్టలపై అక్కడక్కడ విసిరేసినట్లు ఉండే గిరిజన గూడేల్లో నివసించే వారికి ఆపద వచ్చిందంటే డోలీ మోతలు తప్పనిసరి. ఇక నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చే తల్లులు పడే ప్రసవ వేదన మాటల్లో చెప్పలేనిది. జోరు వర్షంలో కిలోమీటర్ల దూరం నొప్పిని భరిస్తూ డోలీలో కొండలు, గుట్టలు దాటుకుని ఆస్పత్రికి చేరుకోవాలి. ఈలోగా కడుపులోని బిడ్డ అడ్డం తిరిగినా, అనారోగ్య సమస్యలు తలెత్తినా ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.
ఆదివాసీల కష్టాలను గుర్తించి గత ప్రభుత్వం గర్భిణీల వసతి గృహాలు ఏర్పాటు చేసింది. నెలలు నిండక ముందే వారిని అక్కడికి చేర్చి వైద్య సేవలతో పాటు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టింది. టీడీపీ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడమే పాపమన్నట్లు భావిస్తున్న సీఎం జగన్ ఇప్పుడు ఈ గర్భిణీ వసతి గృహాలపైనా కక్షగట్టారు. ఎంతగా అంటే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన వసతిగృహాల్లో మరుగుదొడ్లు కూడా బాగు చేయించలేనంతగా.
రహదారి కష్టాలకు చెక్ - ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెంపపెట్టుగా అడవిబిడ్డల అడుగులు
మరమ్మతులకు గురై అంబులెన్స్ మూలకు చేరితే వాడుకలోని తీసుకురాలేనంతగా జగన్ కక్షగట్టారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన గిరిజన గర్భిణీ వసతి గృహాలు ఇప్పుడు సరైన సదుపాయాలే లేక కూనరిల్లుతున్నాయి. ఆదివాసీ మహిళల అరణ్య రోదనను అర్థం చేసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం సాలూరులో గర్భిణీల కోసం ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేసింది. 7 నెలలు నిండిన వెంటనే గిరిశిఖర గ్రామాల నుంచి గర్భిణీలను ఇక్కడికి తీసుకొచ్చి నిరంతరం వారిని పర్యవేక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు.
పౌష్టికాహారం అందించడంతో పాటు నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు సిబ్బందిని నియమించారు. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురంలో రెండు గర్భిణీ వసతి గృహాల్లో ఒక్కో దానిలో 40 మంది గర్భిణీలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాలను పరిశీలించిన నీతి అయోగ్ బృందం దేశానికే ఆదర్శమంటూ కితాబిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా అందించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కూడా ఈ వసతి గృహాలను సందర్శించి రాష్ట్రంలోని మిగితా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలుగుదేశం హయాంలో ఏర్పాటైన ఈ కేంద్రాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేశారు. ముందుగా గిరిజన గ్రామాల్లో గర్భిణీల సర్వే నిలిపివేయడంతో వారిని వసతి గృహాలకు తీసుకొచ్చే ప్రక్రియ నిలిచిపోయింది. వసతి గృహాల్లో సరైన సౌకర్యాలను సైతం కుదించింది. గర్భిణీలు పడుకునేందుకు కనీసం మంచాలు కూడా లేకపోవడంతో కిందే పడుకుంటున్నారు. సాలూరు నీటి సరఫరా పైపు మరమ్మతులకు గురైతే దాన్ని బాగు చేయించకుండా మరుగుదొడ్ల వాడకమే పక్కకు పెట్టేశారు. గుమ్మలక్ష్మీపురం వసతిగృహంలో విద్యుత్ సౌకర్యం సరిగా లేదని గర్భిణీలు వాపోతున్నారు.
గిరిజన గర్భిణీలకు గత ప్రభుత్వం 'ఫుడ్ బాస్కెట్' పథకం ద్వారా పౌషికాహారం అందించేది. ఇప్పుడు అంగన్వాడీల ద్వారా 'సంపూర్ణ పోషణ ప్లస్' పథకాన్ని అమలు చేస్తున్నా అది వసతి గృహాల్లో ఉండే గర్భిణీలకు సక్రమంగా అందడం లేదు. నోరు తెరిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ గగ్గోలు పెట్టే జగన్‌కు నిజంగా గిరిజనులపై ప్రేమ ఉండి ఉంటే ఇలాంటి వసతి గృహాలు మరికొన్ని ఏర్పాటు చేసి వారి కష్టాలు తీర్చేవారు. కానీ జగన్ నాలుగున్నరేళ్లుగా ఆ దిశగా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు.
Tribal People problems: తప్పని డోలిమోతలు.. బైక్‌కు కర్రలు కట్టి ఒడ్డుకు చేర్చిన గిరిజనులు