విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో 2019-20 ఏపీఎస్పీ, సివిల్ శిక్షణా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. జిల్లా పోలీసు శిక్షణా కళాశాలలో 396మంది, చింతలవలస 5వ బెటాలియన్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్లో పాల్గొన్నారు. శిక్షణా కానిస్టేబుళ్ల కవాతుకు ఉపముఖ్యమంత్రి పుష్ప ముఖ్యఅతిధిగా హాజరై... పోలీసుల గౌరవందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన కవాతు అందరిని ఆకట్టుకుంది. కవాతు అనంతరం... శిక్షణలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణీ పురస్కారాలు, పతకాలు అందచేశారు.
ఎపీఎస్పీ విభాగంలో ఇన్డోర్, అవుట్ డోర్, ఆల్ రౌండర్ ప్రతిభతో మూడు అవార్డులు సొంతం చేసుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన దార ప్రసన్నకూమార్ను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. బహుమతుల ప్రదానం అనంతరం ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణీ మాట్లాడుతూ... ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆయా మతాలకు చెందిన దేవుళ్లను ప్రార్థిస్తారు. సమస్య వచ్చినప్పుడు మాత్రం అన్ని మతాల వారు పోలీసులను ఆశ్రయిస్తారని చెప్పారు. ప్రజల ప్రాణాలు, శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.
ఇదీ చదవండీ... 'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'