కరోనా నివారణకు తన బాధ్యతగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేయిస్తున్న భాజపా నేత కాళ్ల నారాయణరావుపై వైకాపా నేతలు కత్తులతో దాడి చేయడం దారుణమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. నారాయణరావు విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా-జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్నారని... తన డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆయనే పూనుకొని చేయిస్తుంటే వాలంటీర్ల ద్వారా వైకాపా నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు.
డీజీపీ సమగ్ర విచారణ జరిపించాలి
స్వచ్ఛందంగా పారిశుద్ధ్య నిర్వహణ చేస్తామని సంబంధిత అధికారులకు తెలిపి ఆ పనులు చేస్తున్న నారాయణరావు, ఆయన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడటం అధికార పార్టీ దౌర్జన్యానికి నిదర్శనం అన్నారు. ఈ దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తగు చర్యలు తీసుకోకపోవడంతో...తిరిగి ఆయనపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ ఘటనపై డీజీపీ సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ డిమాండ్ చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీని పవన్ కోరారు.
పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఉన్నతాధికారులు, మంత్రులు విజయనగరం జిల్లాలోని పెదపెంకి గ్రామాన్ని చూస్తే తెలుస్తుందన్నారు. ఆ గ్రామంలో బోదకాలు వ్యాధితో బాధపడుతున్నవారు ఎంతో మంది ఉన్నారన్నారు. పాలకులకు నిర్లక్ష్యం తగదని పవన్ హితవు పలికారు.
ఇదీ చదవండి : మానవత్వం మంటగలిసింది.. 108 లేటైంది.. అయినా ప్రాణం దక్కింది