విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తెదేపా ఇంఛార్జి కిమిడి నాగార్జున రాజధానికి మద్దతుగా నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. చనిపోయిన రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు. జగన్ సర్కారు రైతుల నమ్మకాన్ని వమ్ముచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మండల కేంద్రం బి.కొత్తకోట, ములకలచెరువులో జనసేన, భాజపా, వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు ప్రకటించాయి.
సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అమరావతి రైతులకు మద్దతుగా సంఘీభావం తెలిపారు.
రాష్ట్ర రాజధాని మూడు ప్రదేశాల్లో కాకుండా అమరావతిలోనే ఏర్పాటు చేయాలని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. రాజధాని ఉద్యమంలో ఇప్పటివరకు 68 మంది రైతులు మరణించటం దారుణమన్నారు.
కడప జిల్లా రైల్వేకోడూరులో తెదేపా నాయకులు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా వినూత్న రీతిలో కొరడా దెబ్బలు తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని కోసం రైతులు ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అటువంటి త్యాగమూర్తులను ఇప్పుడున్న ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కడపలో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వేంపల్లెలోని తన స్వగృహంలో దీక్ష నిర్వహించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించటం అన్ని విధాలా శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి