రాష్ట్రవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్నా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. విదేశాల నుంచి వచ్చినవారు, దిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారు తక్కువగా ఉండటమే దీనికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ క్వారంటైన్ పాటించడం, లాక్‌డౌన్‌ని సమర్థంగా అమలు చేయడం వల్లే కరోనా కట్టడి సాధ్యమైందంటున్నారు. విజయనగరం జిల్లాలో విదేశాల నుంచి వచ్చినవారి సంఖ్య 475గా ఉంది. వీరిలో 300 మంది స్వీయ నియంత్రణ పూర్తిచేసుకున్నారు. అలాగే జిల్లాలో ఇప్పటివరకు 172 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో 66 మందికి నెగెటివ్‌గా నిర్ధరణ కాగా, 106 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
పటిష్టంగా లాక్డౌన్ అమలు
విజయనగరం జిల్లాలో కేసులు లేనప్పటికీ అధికారులు పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరు వ్యూహాలు అమలు పరుస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరోవైపు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. విశాఖ నుంచి రాకపోకలను నియంత్రిస్తున్నారు. నిత్యావసరాల సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 773 మందిపై 372 కేసులు నమోదు చేశారు. 140 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వావానదారులకు ఇప్పటివరకు 90 లక్షల రూపాయలకు పైగా జరిమానాలు విధించారు.