ప్లాస్టిక్ వాడకం నానాటికీ అధికమవుతోంది. అలోహ సంచుల అమ్మకంపై ఎన్ని ఆంక్షాలు విధించినా.. ఏదో ఒక మార్గంలో వినియోగం జరుగుతూనే ఉంది. పర్యవసానంగా పరిసరాల అపరిశుభ్రతతోపాటు.. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్ర తీర ప్రాంతాలూ.. కాలుష్యమయం అవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించే దిశగా... కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా తీర ప్రాంతాల శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లాలో నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో చింతపల్లి బీచ్ స్వచ్ఛతకు నడుం బిగించారు.
స్వచ్ఛ భారత్ పేరుతో పరిసరాల పరిశుభ్రతపై విప్లవం తీసుకొచ్చిన కేంద్రం.. తాజాగా తీర ప్రాంతాల శుద్ధికి పూనుకుంది. తొలి విడతగా 10 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ నుంచి 17వరకు నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఏడు బీచ్‌ల శుద్ధికి పూనుకున్నారు. ఇందులో భాగంగానే విజయనగరంజిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి తీర ప్రాంతంలో అలోహ వస్తువులు, చెత్తాచెదారం తొలగింపు నిర్విఘ్నంగా సాగుతోంది.
బీచ్ శుభ్రత కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు విడతల వారీగా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు రోజుకు వంద కిలోల చొప్పున చెత్తాచెదారం, అలోహ సంచులు, సీసాలు, వ్యర్థాలను తొలగించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ శాఖ అధికారి ఆర్.బి.లాల్ పర్యవేక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా సముద్ర తీరాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా చేయటమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
చింతపల్లి బీచ్ శుద్ధి కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కోర్ వాలంటీర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు నిత్యం రెండు నుంచి మూడు గంటల పాటు తీర ప్రాంతం కలియతిరుగుతూ ప్లాస్టిక్‌ను తొలగిస్తున్నారు. తాము ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటమే కాకుండా తీర ప్రాంతాల ప్రజలకు అవగాహన పెంపొందిస్తామంటున్నారు. నదీ తీరప్రాంతాల శుద్ధి కార్యక్రమంలో అలోహ వస్తువులు, చెత్తాచెదారం తొలగింపు కార్యక్రమంపై స్థానికులతో పాటు.. పర్యటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: