విజయనగరం జిల్లాలో పుర పోరు వేడెక్కుతోంది. పార్టీల ప్రచారం జోరందుకుంటోంది. విజయనగరం కార్పొరేషన్, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు పురపాలికలు సహా.. నెల్లిమర్ల నగర పంచాయతీకి ఎన్నికలు జరగనున్నాయి. మొదటిసారిగా.. విజయనగరంలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్ సీటును బీసీ మహిళకు కేటాయించారు. నగరంలోని 50 డివిజన్లలోనూ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. బొబ్బిలి పురపాలక ఛైర్మన్ పీఠాన్ని బీసీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. సాలూరు పీఠాన్ని జనరల్ మహిళకు, పార్వతీపురం మున్సిపాలిటీ అధ్యక్ష స్థానాన్ని బీసీ మహిళకు. నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు.
ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లోనూ ప్రధాన పార్టీలు ఓట్ల వేటలో పడ్డాయి. పదవినిస్తే పలానా పనులు చేస్తామంటూ... ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. కీలక నేతలు.. వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ విషయంలో వైకాపా, తెలుగుదేశం కాస్త ముందున్నాయి. విజయనగరం మేయర్‌తో పాటు.. మున్సిపల్ స్థానాల్లో అభ్యర్థుల పేర్ల ప్రకటన విషయంలో వైకాపా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఛైర్మన్ అభ్యర్థి ఎవరన్నది బహిర్గతం చేయలేదు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇప్పటికే విజయనగరం మేయర్ పదవికి అభ్యర్థిని ప్రకటించింది. మున్సిపల్, నగర పంచాయతీ ఛైర్మన్ల పదవుల విషయంలోనూ.. స్పష్టతనిచ్చింది. వారికి మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తోంది. పుర పోరులో విజయంపై.. ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఇక భాజపా, జనసేన, కాంగ్రెస్ పార్టీలు., ఇంకా ప్రచార ఢంకా మోగించలేదు. అభ్యర్థుల పేర్ల విషయంలోనూ స్పష్టట రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: మా బసవడి స్పెషల్ మీకు తెలుసా..!