Municipal Employees Protest: విజయనగరం జిల్లా రాజాంలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. సీఎం జగన్ మున్సిపల్ కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ కార్మికులను అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో పర్మినెంట్ చేస్తామన్నారని.. ఈ హామీని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులని పర్మినెంట్ చేస్తామని, ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని శాసనసభలో ప్రకటించారని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఈ హామీలను నెరవేర్చలేదని అన్నారు. మాట తప్పను మడమ తిప్పనన్న సీఎం జగన్.. రాష్ట్రంలో 40వేల మంది మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పి.. వారిని మోసం చేయాలని ప్రయత్నించటం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని చెప్తున్న సీఎం.. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు.
ఈ రంగంలో పనిచేసిన కార్మికులకు కనీస వేతనాలు కూడా అందించట్లేదని ఆయన మండిపడ్డారు. వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, ఇలా ప్రభుత్వమే వారిని దోపిడీ చేయటం దుర్మార్గమని విమర్శించారు. మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంపుదల చేయాలని ఆయన కోరారు. దీంతోపాటు కార్మికులకు యూనిఫాం, రక్షణ, భద్రత సౌకర్యాలు, పనిముట్లు సకాలంలో అందించాలని అన్నారు. తోపుడు బళ్లు, ట్రాక్టర్స్ను తక్షణమే బాగు చేయాలని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
"జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులని పర్మినెంట్ చేస్తామని, ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని శాసనసభలో ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఈ హామీలను నెరవేర్చలేదు. మాట తప్పను మడమ తిప్పనన్న సీఎం జగన్.. రాష్ట్రంలో 40వేల మంది మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పారు. ఇలా కార్మికులను మోసం చేయటం సరికాదు. సీఎం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి." - సీహెచ్ రామ్మూర్తి నాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి