విజయనగరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు డిమాండ్ చేశారు. స్థానిక అమర్ భవన్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రంగరాజు, కామేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
పణంగా పెట్టారు..
పారిశుద్ధ్య కార్మికులు కరోనా సమయంలో కూడా తమ జీవితాలను పణంగా పెట్టి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించారని కొనియాడారు. అలాంటి వారికి అదనంగా రెండు నెలల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులకు జీతాలు ఇవ్వకపోవటం బాధాకరమని అన్నారు.
ఇబ్బందిపడుతూ..
సంవత్సర కాలంంగా సబ్బులు, నూనెలు, చెప్పులు ఇవ్వకపోవడం వల్ల కార్మికులంతా ఇబ్బంది పడుతూ విధులు నిర్వహించాల్సి వస్తుందన్నారు.
రూ.50 లక్షల బీమా..
కరోనా సమయంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ రూ. 50 లక్షల రూపాయల బీమా కల్పించాలని కోరారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు వసూలు చేసిన సుమారు 8 లక్షల రూపాయలు సంబంధిత కార్యాలయంలో జమ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దశలవారీగా..
రానున్న కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే.. దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, యూనియన్ నాయకులు శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : వెదర్ అప్డేట్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం