కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా వ్యాపార వర్గాలు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు, మండల కేంద్రాల్లోనూ లాక్ డౌన్ అమలవుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ, కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములు అవుతున్నారు. ప్రజల నుంచి వ్యాపార వర్గాల నిర్ణయానికి సంపూర్ణ మద్ధతు లభిస్తోంది.
సంచార రైతు బజార్లతో వినియోగదారుల వద్దకే..
అయినప్పటికీ, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ జిల్లా విభాగం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతు బజార్లలో ప్రజలను నియంత్రించేందుకు మార్కెటింగ్ శాఖ సంచార కూరగాయల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు విజయనగరం జిల్లాలో మొదటి విడతగా 10 సంచార రైతు బజార్లను నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 6 వాహనాలు ప్రజలకు ఈ తరహా సేవలందిస్తున్నాయని రైతు బజార్ అధికారి సతీష్ తెలిపారు.
అందుబాటులో తాజా కూరలపై ప్రజల హర్షం..
సంచార రైతు బజార్ వాహనాల ద్వారా వినియోగదార్లకు రోజువారీ అవసరమైన కూరగాయలన్నింటినీ వ్యాపారులు అందిస్తున్నారు. ఎలాంటి అదనపు ధరలు విధించకుండా రైతుబజారు ధరలకే ప్రజలకు సరఫరా చేస్తున్నారు. రైతుబజార్లకు వచ్చిన కూరగాయల్లో 25 శాతం మేర సరుకును సంచార వాహనాల ద్వారా విక్రయిస్తున్నారు. ఇలా.. విజయనగరంలో మెుత్తం 6 సంచార వాహనాల ద్వారా నిత్యం 7 నుంచి 8 వార్డుల్లో కూరగాయలను వినియోగదార్లకు అందజేస్తున్నారు. సంచార వాహనాల్లో.. రైతు బజార్ల సేవలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్దకే తాజా కూరగాయలు వస్తుండటం పలు విధాలుగా ఉపయోగకరంగా ఉందంటున్నారు. రైతు బజార్లలో విక్రయించే ధరలకే లభిస్తుండటం కరోనా పరిస్థితుల్లో వెసులుబాటుగా ఉందని వినియోగదారులు అంటున్నారు.
సంచార రైతుబజార్లతో తగ్గిన రద్దీ..
కోవిడ్ వ్యాప్తిని అరికట్టెందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా సంచార రైతు బజార్లకు ఆదరణ పెరగటంతో జిల్లా కేంద్రంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల భవనాలు, దాసన్నపేట రైతు బజారులోని వ్యాపారులను విశాలమైన ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతాల్లో కూడా కొనుగోలుదార్లు సామాజిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవీ చదవండి:
కోవిడ్ నియంత్రణ మా పని కాదు: ఈసీ
'గుర్తింపు ఇచ్చి 15 రోజులైనా.. కోవిడ్ చికిత్స ప్రారంభించరా?'