JNTU Gurajada Buildings Laying Foundation: కళాశాల నుంచి విద్యార్దులు బయటకొచ్చిన వెంటనే ఉపాధి మార్గం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. . గ్లోబల్ స్థాయిలో పోటీని తట్టుకునేలా విద్యార్ధులను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో 19కోట్ల రూపాయలతో నిర్మించనున్న పరీక్షల విభాగం భవనం, ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.
విశ్వవిద్యాలయానికి గురజాడ పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ విశ్వవిద్యాలయానకి అనుబంధంగా కురుపాంలో 150 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కురుపాంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని మంత్రి తెలియచేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం విద్య కోసం వెచ్చించిన ప్రతి రూపాయి మానవవనురుల కోసం పెట్టుబడి అనే విషయాన్ని గ్రహించాలన్నారు. రాష్ట్రంలో విద్యా పరమైన కార్యక్రమాలు ఎవరి మెప్పు కోసమో చేయట్లేదన్నారు.
విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా వీసీల బృందాన్ని జర్మనీ పంపించినట్లు తెలిపారు. అక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉందో తెలుసుకుని వాటిని ఇక్కడ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. జర్మనీలో అధ్యయనమే కాకుండా.. ఉద్యోగాల పరంగ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మంత్రి బొత్స తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ ఇంచార్జ్ వీసీ ప్రసాద్ రాజు, విజయనగరం ఏపీ బెల్లన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేష్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: