Jawad Cyclone Updates: జవాద్ తుపాను దిశ మార్చుకుని బలహీన పడినా.. తీసుకున్న ముందస్తు చర్యలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా అండాలని అధికారులను ఆదేశించామన్నారు. జవాద్ తుపాన్‌పై విజయనగరం జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ సమీక్షలో.. కలెక్టర్ సూర్యకుమారి, ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, సంయుక్త కలెక్టర్లు, జిల్లా పరిషత్తు ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వివిధశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తుపాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి బొత్స సూచించారు. పంట నష్టం వాటిల్లకుండా తీసుకున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. తుపాను బలహీన పడినా..,అనంతరం కురిసే వర్షాలకు జిల్లాలో చంపావతి, నాగావళి నదులు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పునరావాస కేంద్రాలు, ఇతర ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..,అధికారుల ఆదేశాలు పాటించాలని విజ్ఞప్తి చేసారు.
దిశ మార్చుకున్న జవాద్..
jawad cyclone: జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపుగా కదులుతోంది. ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో జవాద్ తుపాను పయనిస్తోంది. విశాఖకు ఆగ్నేయంగా 210 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గోపాల్‌పూర్‌కు 320 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమవ్వగా.. పారాదీప్‌కు 470 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. సాయంత్రానికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రేపు మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఒడిశాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి