కాదేదీ అక్రమ తవ్వకాలకు అనర్హం అనుకున్నారేమో గానీ మాంగనీసు ఖనిజం కోసం ఏకంగా శ్మశాన వాటికలోనే తవ్వకాలకు తెగబడ్డారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం గొట్నింద గ్రామంలో జరుగుతున్న ఈ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమ తవ్వకాలకు పాల్పడిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.
గొట్నింద శ్మశాన వాటిక స్థలంలో మాంగనీసు ఖనిజం ఉందంటూ దాన్ని వెలికితీసేందుకు కొందరు అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందడంతో ఎస్‌ఐ పి.నారాయణరావు సిబ్బందితో కలసి సోమవారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేశారు. శ్మశాన స్థలంలో తవ్వకాలు చేస్తూ 15 మంది కూలీలు చిక్కారు. దీనికి సంబంధించి భూగర్భ గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు వారి వద్ద లేవు. అప్పటికే అక్కడ తవ్విన పెద్ద గోతులున్నాయి.
వెలికితీసిన ట్రాక్టర్ లోడు మాంగనీసు ఖనిజం పోగు ఉంది. దీన్ని స్వాధీనం చేసుకుని, కూలీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. మాంగనీసు అక్రమ తవ్వకాల గురించి భూగర్భ గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. స్వాధీనం చేసుకున్న ఖనిజాన్ని.. వారికే అప్పగిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: