తరాలు మారినా...ప్రభుత్వాలు, పాలకులు మారినా...నాయకులు ఓట్లకోసం ఎన్ని హామీలిచ్చినా అవన్నీ గిరిజనుల తలరాతలను మార్చలేకపోతున్నాయి. అంతరిక్ష రంగంలో దేశం దూసుకెళ్తున్నా గిరిపుత్రులకు మాత్రం కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం విఫలమవుతున్నాయి.
నడిచేందుకే దారి లేని దుస్థితి....
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని మారయ్య పాడుకున్న ఏకైకమార్గం ఇది. ఈ ఊరి వాసులు మైదాన ప్రాంతానికి రావాలంటే నానా అవస్థలు పడాల్సిన దుస్థితి. రాళ్లు, రప్పలు, గుంతలతో తో నడిచేందుకు వీలులేక...ప్రాణం మీదకు వచ్చినా పరిగెత్తలేని పరిస్థితి నెలకొంది.
గమ్యం చేరలేక...గర్భిణీ కష్టాలు
తాజాగా ఇదే గ్రామానికి చెందిన 9 నెలల నిండు గర్భిణి జ్వరంతో మైదాన ప్రాంతానికి వచ్చి వెళ్లేందుకు నానా అవస్థలు పడింది. అతి కష్టం మీద కొండ నుంచి కిందికి వచ్చిన మాలతి మళ్లీ గ్రామానికి చేరుకునేందుకు గుంతలు, గోతులమయమైన దారిలో నరకయాతన అనుభవించింది. అడుగులో అడుగేసుకుంటూ కొంతదూరం నడిచినా గమ్యం చేరలేక రోడ్డుపైనే కూర్చుండిపోయింది. గర్భిణీ కష్టాలు చూసిన బంధువులు డోలీలో అతి కష్టం మీద గ్రామానికి తీసుకెళ్లారు. ఎంతో మంది మహిళలు ఇలాంటి దుస్థితిని అనుభవించిన వారే. చాలా మంది మార్గ మధ్యంలోనే ప్రసవించిన రోజులున్నాయి.
వృద్ధుడికి కడుపు నొప్పి...బంధువుల అష్ట కష్టాలు
ఇదే గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నట్టుండి కడుపు నొప్పితో కుప్పకూలిపోయాడు. అతన్ని మైదాన ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించేందుకు బంధువులు అష్టకష్టాలు పడ్డారు. చివరకు డోలి కట్టి గ్రామం నుంచి ఆస్పత్రికి తరలించారు.
ఓట్ల కోసం కోటి మాటలు...
ఈ డోలీ కష్టాలు ఒకట్రెండు గ్రామాలకే పరిమితం కాలేదు. సాలూరు మండలంలోని సుమారు ముప్పై ఊర్లదీ ఇదే దీన స్థితి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఉత్తుత్తి హామీలు ఇచ్చే నాయకులు తర్వాత తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.