JANASENA NADENDLA MANOHAR: ప్రతిపక్షాలపై వైసీపీ నాయకులు దాడి చేయటం దారుణమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బేవరపేటలో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వారిపై జరిగిన దాడి గురించి బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన.. మంత్రి బొత్స నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగటం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనలో బాధితులకు సరైన న్యాయం జరగకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతామని ఈ సందర్భంగా మనోహర్ హెచ్చరించారు.
చీపురుపల్లి నియోజకవర్గంలోని బెవరపేట గ్రామంలో 22వ తేదీన గ్రామంలో వైసీపీ నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారని నాదెండ్ల తెలిపారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వైసీపీ నేతలు స్టిక్కర్లను అంటించారన్నారు. అయితే జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన కొంతమంది.. తమ ఇళ్లకు వైసీపీ స్టిక్కర్లను అంటించటాన్ని నిరాకరించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఉందనే ఉద్దేశంతో వారు స్టిక్కర్లను అంటించనివ్వలేదని తెలిపారు.
వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇళ్ల నిర్మాణం వంటి వాటిపై స్థానిక వైసీపీ నేతలు లంచాలు తీసుకున్నారని... దీంతో వారు స్టిక్కర్లను అంటించేందుకు నిరాకరించారని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నేతలు దాడి చేస్తారనే అనుమానంతో ఈ సంఘటన జరిగిన వెంటనే తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు వారు ఫిర్యాదు చేశారని నాదెండ్ల తెలిపారు. కాగా అనుకున్నట్లుగానే రెండు, మూడు రోజుల తర్వాత క్రికెట్ బ్యాట్స్, కర్రలతో వైసీపీ నేతలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన సుమారు 14 మందిని చికిత్స మేరకు ఆస్పత్రికి తరలించారన్నారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారని.. వారిపై దాడి చేయకుండా కాపాడటంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని నాదెండ్ల అన్నారు.
కాగా.. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నలుగురికి జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరికీ 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ నుంచి అందిస్తున్నట్లు మనోహర్ తెలిపారు. ఈ దాడిలో ఒక వర్గం ఇచ్చిన ఫిర్యాదులకు కఠినమైన కేసులు పెట్టారని, దాడికి గురైనవారి ఫిర్యాదులపై మాత్రం నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
ఇవీ చదవండి: