కట్టుకున్నవాడే భార్యను కడతేర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస పంచాయతీ కొండగుడ్డి గ్రామానికి చెందిన సంబాపు పుష్ప కుమిలికి సమీపాన ఉన్న ఓ చిన్న పరిశ్రమలో రోజుకూలీగా పనిచేస్తోంది. ఎప్పటిలానే శుక్రవారం పనికి బయలుదేరింది. ఇక్కడే ఉంటున్న భర్త శ్రీను తనకు ఆరోగ్యం బాగాలేదని, కుమిలిలో తాయెత్తు కట్టించుకుంటానంటూ చెప్పి తనతో పాటు ద్విచక్ర వాహనంపై భార్యను తీసుకెళ్లాడు. ఆ తర్వాత స్వగ్రామమైన మెరకముడిదాం మండలం శివందొరవలస వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కూతురు ఇంటికి రాకపోవడంతో ఆదివారం ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కుమిలిలో ఆమెను వదిలి వెళ్లానని, ఏమైందో తనకు తెలియదని భర్త చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత అతను ఆత్మహత్యకు యత్నించాడు. చీపురుపల్లి ఆసుపత్రికి తరలించారు. భర్తతో వెళ్లిన పుష్ప జాడ లేకుండా పోవడంతో అతనిపై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా గాలించారు. ఈక్రమంలో కుమిలి గ్రామ పొలిమేరల్లో కొండపై ఆమె మృతదేహన్ని మంగళవారం గుర్తించారు. ఘటనా స్థలాన్ని సీఐ శ్రీధర్, ఎస్‌ఐ జయంతి పరిశీలించారు. పుష్పను మెడ నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయినట్లు సీఐ తెలిపారు. అనుమానమే హత్యకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ... చర్చలకు తామెప్పుడూ సిద్ధమే : మావోలు