స్నేహితుని మరణాన్ని తట్టుకోలేకపోయిన కొందరు యువకులు.. అతని విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమ ప్రేమను చాటుకున్నారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన రౌతు జగదీష్ 210 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో కోబ్రా కమాండెంట్‌గా పని చేసేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చత్తీస్ఘడ్-బీజాపూర్ సరిహద్దుల్లో మావోలు-భద్రత బలగాల మధ్య జరిగిన కాల్పులో వీరమరణం పొందారు.
పిన్న వయస్సులోనే విధి నిర్వహణలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వీర జవాన్ రౌతు జగదీష్ జ్ఞాపకార్ధం.. ఆయన స్నేహితులు పార్క్ ఏర్పాటు చేశారు. తను లేడనే నిజం ఎప్పటికీ నమ్మలేనిదని.. మా మధ్య లేకున్నా నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మా గుండెలలో పదిలంగా ఉంటాయంటూ.. జగదీష్ కాంస్య విగ్రహన్ని నెలకొల్పారు. రౌతు జగదీష్ మెమోరియల్ పార్క్ పేరిట తీర్చిదిద్దిన ఉద్యానవనంలో.. రౌతు జగదీష్ విగ్రహాన్ని ఆయన తల్లిదండ్రులు సింహాచలం, రమణమ్మల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీర జవాన్ రౌతు జగదీష్ బంధుమిత్రులతో పాటు కాలనీ వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఓ వీరుడా నీకు వందనం అంటూ ఆయన విగ్రహనికి నివాళులు అర్పించారు. తమ కూమారుడు పేరిట.. స్నేహితులు, బంధుమిత్రులు విగ్రహం ఏర్పాటు చేయండంపై జగదీష్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.
గ్రామం అంతా ఏకమై..
మొదటగా గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు తీర్మానించారు. అందులో భాగంగా గ్రంథాలయం పక్కనే ఉన్న పార్క్ కోసం ఖాళీ స్థలం కేటాయించారు. దీనికి జవాన్ జగదీష్ స్నేహితులు ముందుకు వచ్చి.. పార్క్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మిత్రుడి జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయాలని జగదీష్ మిత్రులంతా నిర్ణయం తీసుకుని దానిని అమలు చేశారు. వారే అంతా ఏర్పాట్లు పూర్తి చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. జగదీష్ పుట్టినరోజు సందర్భంగా అతని తల్లిదండ్రులతో పార్క్‌తో పాటు విగ్రహాన్ని ప్రారంభం చేయించారు.
చాలా సంతోషంగా ఉంది..
జగదీష్ మా మధ్యలో లేకున్నా అతని ప్రతీరూపంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా కుమారుడు మాకు భౌతికంగా దూరమైనా.. దేశం కోసం తను చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అతని సేవలు గుర్తిస్తూ గ్రామస్థులంతా కలిసి పార్క్, స్నేహితులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తనుకు ఇచ్చే ఘనమైన నివాళి. దేశ సేవకోసం జగదీష్ లాంటి సైనికుడికి తల్లిదండ్రులైనందుకు గర్వంగా ఉంది. -జగదీష్ తల్లి దండ్రులు.
ఇదీ చదవండి: