Food Courts In Vizianagaram : ఆకలితో ఉన్న నలుగురికి అన్నం పెట్టినా చాలనుకున్నారు విజయనగరం నగరపాలక సంస్థ పాలకవర్గం. ఆకలితో అలమటిస్తూ దొరికిన కొద్దో గొప్పో తిని ఆకలి తీర్చుకుంటున్న వారిని చూసి చలించిపోయారు. వెంటనే వారి ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా నెలకొల్పిన ఈ ఫుడ్ కోర్టులు ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్నాయి.
విజయనగరంలో కరోనా కాలంలో రోడ్లపై ఆకలితో పస్తులుంటూ.. ఎవరో దాతలు ఇచ్చిన వాటిని తిని కడుపు నింపుకుంటున్న వారిని చూసి, విజయనగరం నగరపాలక సంస్థ పాలకులు.. వారి ఆకలిని తీర్చాలనే ఉద్దేశ్యంతో సంవత్సరంన్నర క్రితం ఫుడ్ కోర్టులను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లైన కంటోన్మెంట్, ఆర్టీసీ బస్టాండ్, కోట, ఎన్సీఎస్ థియేటర్ కూడళ్ల వద్ద ఏర్పాటైన.. ఈ ఫుడ్ కోర్టులు మధ్యాహ్నం, సాయత్రం రెండు పూటల ఉచితంగా ఆహారాన్ని అందిస్తూ అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నాయి.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ కోర్టుల్లో.. నేరుగా ఫుడ్ కోర్టుల వద్దకే వచ్చి ఆహారం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. నాలుగు ఫుడ్ కోర్టులకు అవసరమైన నాలుగు ఫ్రిజ్‌లను కొనుగోలు చేశారు. ఫుడ్ కోర్టుల్లో ఆహారం సమాకూర్చేందుకు నగరంలోని స్వచ్ఛంద సంస్థలను, ట్రస్టులను, దేవస్థాన కమిటీలను, హోటళ్లను నగరపాలక సంస్థ ఇందులో భాగస్వామ్యం చేసింది. వీరి సహకారంతో ఫుడ్ కోర్టులు మధ్యాహ్నం, సాయంత్రం కలిపి దాదాపు 600 మందికి అహారాన్ని అందిస్తున్నాయి
నగరానికి వివిధ పనులకు, ఆరోగ్యరీత్యా ఆసుపత్రులకు, చదువుకోవటానికి కళాశాలలకు, జిల్లా కేంద్రానికి వస్తున్న వారి ఆకలి తీర్చేందుకు వీటిని ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ డిప్యూటి మేయర్ కోలగట్ల శ్రావణి తెలిపారు. ఆకలితో బాధపడుతున్న వారి ఆకలి తీర్చేందుకు.. నగరానికి వచ్చిన వారికి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వీటిని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రయోగాత్మకంగా మాత్రమే వీటిని ఏర్పాటు చేశామని మున్ముందు ఇలాంటి వాటిని.. మరిన్ని ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.
"విజయనగరానికి చాలా మంది ఉద్యోగం కోసం, చదువుకోవటానికి, వైద్యానికి వస్తుంటారు. ఆహారం కోసం వారు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. వారికి ఆర్థికంగా భారం. వారి అకలిని తీర్చాలనే ఆలోచనతో పుట్టుకువచ్చిందే ఈ ఫుడ్ కోర్టు. నగరంలో నాలుగు ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశాము." -కోలగట్ల శ్రావణి, విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్
విజయనగరం నగర పాలక సంస్థ ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు పూనుకోగా.. వాటి నిర్వహణ మాత్రం వివిధ ట్రస్టులు, దేవస్థాన కమిటీలు చూసుకుంటున్నాయి. ఏర్పాటు చేసిన మొదట్లో నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు వీటిని నిర్వహణ బాధ్యతలను భుజాలకెత్తున్నారు. తర్వాత ఎన్సీఎస్ ట్రస్టు, కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ, పంచ ముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ, విజయనగరం హోటల్స్ అసోసియేషన్ సభ్యులు నిర్వహణలో భాగం అయ్యారు.
నగరంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులో కొన్ని ప్రధాన కూడళ్ల వద్ద దాతలే నేరుగా వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు. వాటి బాధ్యత మాత్రమే కాకుండా ఆకలి తీర్చుకోవటానికి వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ఎన్సీఎస్ థియేటర్ కూడలి వద్దనున్న ఫుడ్ కోర్టు భాద్యతలు నిర్వహిస్తున్న గౌరి సేవా సంఘం.. మరో అడుగు ముందుకేసింది. భోజనం చేస్తున్న వారు ఆరుబయట తినాల్సి వస్తోందని వారి కోసం షెడ్ నిర్మించారు. ఫుడ్ కోర్టు వద్ద భోజనం చేసేవారు ప్రశాంతంగా తినాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్టు సేవా సంఘం ప్రతినిధులు చెప్తున్నారు.
"ఎన్సీఎస్ థియేటర్ కూడలి వద్ద శ్రీ గౌరి సేవాసంఘం అధ్వర్యంలో ఫుడ్ కోర్టు నడుస్తోంది. మా తాతగారి జయంతి సందర్భంగా వారి పేరున.. షెడ్ నిర్మించాము. మధ్యహ్నం భోజనం చేస్తున్న వారికి వసతి లేక ఎండలో నిల్చోని తింటున్నారు. వారికోసం దీనిని నిర్మించాము."-సుధాకర్, గౌరి సేవాసంఘం ప్రతినిధి, విజయనగరం
రోజుకు ఒక్కపూట ఆహారం దొరికిన చాలనుకునే వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి అకలిని తీర్చాలనే ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ కోర్టులు ఆకలి తీరుస్తున్నాయని.. అక్కడ భోజనం చేసిన వారంటున్నారు. ఇంట్లో తిన్న విధంగానే పలు రకాల వంటకాలు వేడి వేడిగా వడ్డిస్తున్నారని వారు అంటున్నారు. ఒకవేళ వీటి ఏర్పాటు లేకపోతే తాము పస్తులుండే వాళ్లమని వారు అంటున్నారు. వీటిని ఏర్పాటు చేయకముందు ఆహారం దొరకటం ఇబ్బందిగా ఉండేదంటున్నారు.
"నేను ప్రతిరోజు ఫుడ్ కోర్టు వద్దే తింటున్నాను. రోజుకు ఐదు రకాల కూరలు వడ్డిస్తున్నారు. అన్ని వేడి వెేడిగా పెడుతున్నారు. ఇక్కడ భోజనం చాలా బాగుంది. ఇది లేకముందు అన్నం తినాలంటే ఇబ్బంది పడే వాడ్ని. ఇప్పుడు ఇక్కడే తింటున్నాను. ఇది లేకపోతే పస్తులుండాల్సిందే."- సురేష్, విజయనగరం
చాలా మంది అన్నదానం చేయాలని అనుకుని ఎలా చేయాలో తెలియక .. వారి ఆలోచన విరమించుకుంటున్నారు. అలాంటి వాళ్లకి ఈ ఫుడ్ కోర్టులు ఇతరుల ఆకలి తీర్చేందుకు ఆవకాశం ఇస్తున్నాయి. ప్రజలలో వీటి ఆదరణ పెరిగిన దృష్ట్యా మరిన్ని ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని.. విజయనగరం నగరపాలక సంస్థ పాలకవర్గం యోచిస్తోంది.
ఇవీ చదవండి :