విజయనగరం జిల్లా యాతిపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రెక్కల కష్టంపై జీవిస్తున్న అన్నదమ్ముల కల ఆహుతైంది. పేదరికం కారణంగా ఏళ్లుగా పూరి పాకలోనే జీవిస్తున్న వారు పక్కా ఇళ్లు నిర్మించుకుందామనుకున్నారు. అందుకోసం రూపాయి రూపాయి పోగేసి ఓ చోట భద్రపరిచారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ పక్కపక్కనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఉన్న కొద్దిపాటి భూమిని అమ్ముకున్నారు.
అలా వచ్చిన రూ.5 లక్షలను వారు ఉంటున్న పూరిపాకలోనే దాచుకున్నారు. కానీ.. ఇంతలోనే విధి వక్రించింది. అనుకోని అగ్ని ప్రమాదం వారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. వారు దాచుకున్న సొమ్ము కాస్త బూడిదైంది. దానితో పాటు ఇంట్లోని విలువైన ఆభరణాలు సైతం కాలిపోయాయి. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న సొమ్ము ఇలా కావడంపై వారు కన్నీటిపర్యంతమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు విజయనగరం అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే అంతా జరిగిపోవడంతో.. ఫలితం లేకుండా పోయింది. జరిగిన ఆస్తి నష్టం వివరాలను తహసీల్దార్, వీఆర్వో, ఆర్ఐలు పరిశీలించారు.
ఇవీ చదవండి:
Biological-E: రూ.500లకే రెండు డోసుల టీకా!
విజయనగరం జిల్లాలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ పైలెట్ ప్రాజెక్టు అమలు!