విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రెండేళ్లుగా అడవి ఏనుగులు గుంపులుగా సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఎక్కువగా జియ్యమ్మవలస, కోమరాడ మండలాల్లోని సమీప పొలాల్లో అరటి, వరి, చెరుకు, పామాయిల్ తోటల్లో తిరుగుతూ వ్యవసాయ పరికరాలను సైతం నాశనం చేశాయి. కొన్నాళ్ల క్రితం శ్రీకాకుళం వైపు వెళ్లిన ఆ ఏనుగులు.. మళ్లీ కురుపాం ఏజెన్సీ వైపు ప్రతాపం చూపిస్తున్నాయి. ప్రస్తుతం.. జియ్యమ్మవలస మండలంలోని బాసంగి, వెంకటరాజపురం, గిజబ, బిత్రపాడు, గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి పంటలను నాశనం చేస్తుంటే... ఏం చేయాలో పాలుపోక రైతులు బాధపడుతున్నారు.
గతంలో ఒకరు మృతి
గతంలో.. ఏనుగులు గుంపు దాడి కారణంగా.. బాసంగి గ్రామంలో ఒక మహిళ మృతి చెందిన విషయాన్ని గ్రామస్థులు గుర్తు చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అడవి ఏనుగులను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని కోరారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే... మరోవైపు అడవి ఏనుగుల గుంపు వల్ల పొలాలకు వెళ్ళడానికి భయంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చదవండి: