Education Syllabus Changes in AP : పాఠశాల విద్యతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోంది. సీఎం జగన్ తుగ్లక్ నిర్ణయాలతో బడి పిల్లల భవితకు భరోసా లేకుండా పోయింది. ప్రచార యావతో పాఠశాల విద్యను అగాధంలోకి నెట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానాలతో విద్యార్థులు, టీచర్లు అయోమయానికి గురయ్యే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో నాడు- నేడు అంటూ విప్లవాత్మక మార్పులు తెచ్చామని గొప్పలు చెప్పడమే తప్ప చేసింది మాత్రం శూన్యం. పేద విద్యార్థులను ఎక్కడికో తీసుకెళ్తామన్నట్లు కబుర్లు చెబుతారు. రాష్ట్ర సిలబస్ బాగోలేదని అంతర్జాతీయ బ్రాండ్ ఉన్న C.B.S.E సిలబస్ తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ సిలబస్‌తో విద్యార్థులకు నాణ్యమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా శారీరక, మానసిక ఎదుగుదలకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కృషితో పిల్లల భవిష్యత్ మారిపోతుందంటూ జగన్ మామ పలికిన పలుకులు మీరే చూడండి..
మొన్నటి వరకు CBSE అన్న పెద్దమనిషి ఇప్పుడు ఐబీ అంటున్నారు. ఎక్కడైనా పాఠశాలల్లో రెండేళ్లకోసారి సిలబస్‌ను మార్పు చేస్తారా? ఇలా పిల్లలను కూడా మాయ చేయాలని చూస్తారాయన? ఈ ఏడాది 1 నుంచి 7 తరగతులతో పాటు తొమ్మిదో తరగతికీ N.C.E.R.T అమలు చేస్తున్నారు. ఈ దశలో ఐబీ సిలబస్ అమలు చేస్తే పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ఇలాంటి అశాస్త్రీయ విధానాలతో ప్రాథమిక బడులు మూతపడుతున్నాయి. గత రెండేళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోయారు. ఇప్పటికే గతేడాది లక్షా 73 వేల మంది పిల్లలు బడి మానేశారు. ఈ ఏడాది సైతం ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు లక్షా70 వేల మంది పిల్లలు తగ్గిపోయారు.
ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ C.B.S.Eగుర్తింపు సాధించాలని, మొదటి విడతగా 13వందల పాఠశాలల జాబితాను పంపిస్తే గతేడాది వెయ్యి 92 బడులకు అనుమతి వచ్చింది. ఈ ఏడాది ఇంతవరకు ఒక్క బడికీ అనుమతి ఇవ్వలేదు. గతేడాది జాబితాలో మిగిలిన వాటికైనా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరినా C.B.S.E స్పందించలేదు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే సీఎం జగన్ ఇంటర్నేషనల్ సిలబస్‌ను తెరపైకి తెచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- No PG Admissions: ఉన్నత విద్యకు ‘ఉరి’.. పడిపోయిన పీజీ ప్రవేశాలు.. మాటలు తప్ప చేతలు చూపించని వైసీపీ సర్కారు
విద్యార్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఫార్మాటివ్-1 పరీక్షలను ఆంగ్లంలోనే రాయాలని విద్యాశాఖ నిబంధన విధించింది. ఒకవేళ విద్యార్థులు ఆంగ్లంలో రాయకపోతే ఉపాధ్యాయులను రాష్ట్ర సచివాలయానికి పిలిపిస్తానని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హెచ్చరించారు. దీనికితోడు ఆంగ్ల భాష ప్రశ్నపత్రం పార్ట్-బీలో టోఫెల్ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. దీనికి సన్నద్ధం చేయడమూ ఉపాధ్యాయులకు కత్తి మీద సాములా మారింది. N.C.E.R.T సిలబస్‌కు అనుగుణంగా ఉండే బైజూస్ కంటెంట్‌ను గతేడాది 4 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఇచ్చారు. ఎనిమిదో తరగతి వారికి గతేడాది ట్యాబ్‌లు ఇచ్చారు. ఇప్పుడు సిలబస్ మారితే లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్ వృథా అయినట్టే. పాఠశాల విద్యాశాఖ కొత్తగా తయారు చేస్తున్న ఈ-కంటెంట్ కోసం కోట్లలో వ్యయం చేయబోతోంది. దీంతో భవిష్యత్తులో బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వం నిలిపివేస్తుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు కంటెంట్‌లు, రెండు పద్ధతులతో అభ్యసనలో విద్యార్థులు, బోధనలో గురువులకు ఇబ్బంది తప్పదు.