కొవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడాలని.. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో మూడోవిడత వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. టీకా రిజిష్ట్రేషన్ ప్రక్రియ, తదితర విషయాలపై ఆరా తీశారు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ మూడోదశలో వ్యాక్సిన్ను అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుంచి 60 ఏళ్లు లోపువారికీ టీకా వేయనున్నట్లు పేర్కొన్నారు.
ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి..
వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునేవారు ముందుగానే ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. టీకా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలగవన్నారు. వైద్యులు సూచనల మేరకు.. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు.
ఎంతమందికి వేశారు..?
టీకా పంపిణీ ప్రక్రియలో భాగంగా మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 17వేల మంది వైద్యారోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటివరకు సుమారు 13 వేల మందికి టీకా అందించామని, రెండో విడతలో రెవెన్యూ, పంచాయితీరాజ్, మున్సిపల్, తదితర ఫ్రంట్ లైన్ వర్కర్స్కు వ్యాక్సిన్ను అందించామన్నారు. సుమారు 25వేల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా, ఇప్పటివరకు 10 వేల మందికి టీకా వేశామన్నారు. తాజాగా సుమారు 3వేల మంది పోలీసులకు టీకా వేశామన్నారు.
కేంద్రాల ఏర్పాటు..
జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుంచి మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రయ ప్రారంభమైందని కలెక్టర్ అన్నారు. అందుకోసం 42 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని 9 ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా టీకాను అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి రామ్మోహన్ టీకా రెండో డోసును వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం హెచ్ఓ చామంతి, వైద్యాధికారి లావణ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.