తొలి కాన్పులో ఆడపిల్ల జన్మించడంతో మహాలక్ష్మి పుట్టిందని సంబరపడ్డారు. భవిష్యత్‌పై కలలు కన్నారు. తీరా కుమార్తె కదలలేని, నడవలేని స్థితిని చూసి.. బాధపడ్డారు. మరో మూడేళ్ల తేడాతో మరో రెండో ఆడపిల్ల పుట్టింది. ఆ చిన్నారిది కూడా అదే పరిస్థితి కావడంతో... తల్లిదండ్రులు కుమిలిపోయారు. నలుగురి ఆడపిల్లల సంతానంతో..ఇద్దరు ఇలానే ఉండటంతో వారు కన్నీరుమున్నీరవతున్నారు.
నలుగురు పిల్లల్లో..ఇద్దరు అంగవైకల్యం గలవారే..!
విజయనగరం జిల్లా మక్కువ మండలం అనసభద్రలో గోపాలం, రాధ దంపతులకి నలుగురు ఆడపిల్లలు. తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడ్డారు. బిడ్డ భవిష్యత్ గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కొద్దిరోజుల్లోనే బిడ్డ ప్రవర్తన చూసి ఆస్పత్రికి తీసుకెళ్లగా... శరీర అవయవాలు పనిచేయవని తెలుసుకుని కుమిలిపోయారు. తర్వాత పుట్టిన బిడ్డకి అదే సమస్య . దీంతో ఆ పేద దంపతుల బాధ రెట్టింపైంది.
పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి
పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి గోపాలం దంపతులది. గోపాలం పనికి వెళ్తే... భార్య ఇంటి దగ్గర పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటుంది. ఆకలేస్తే ఏడవడం తప్ప... మరేమీ తెలియని పిల్లలు వారు. పుట్టినప్పటి నుంచి కనిపించదు, వినిపించదు. చేతులు, కాళ్లు కూడా కదలలేని స్థితిలో ఉన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఆ దంపతులు. సరైన వైద్యం అందించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని ఆ దంపతులు వాపోతున్నారు.
ఆదుకోండి..!
పిల్లలని పెంచటమే కష్టంగా మారిందని.... వైద్యానికి ఖర్చుపెట్టే స్తోమత వారి దగ్గర లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇదీ చూడండి.కృష్ణానదికి పోటెత్తుతున్న వరద... ముంపు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ