విజయనగరం జిల్లాలో 26వ నంబరు జాతీయ రహదారి తర్వాత కీలకమైంది సీఆర్‌ఆర్ (చిలకపాలెం, రామభద్రపురం, రాయగడ) మార్గం. ఇటీవల దీన్ని 4వ నెం. రాష్ట్రీయ రహదారిగా పేరు మార్చారు. ర.భ.శాఖ అధికారులు ఓ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే జరిపించగా రోజూ 13 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు తేలింది. ఇందులో 70 శాతం పైచిలుకు అంతర్రాష్ట్రానికి వెళ్తున్నాయి. ఇంతటి కీలకమైన రోడ్డు అభివృద్ధికి ఏళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నా.. పట్టించుకునే వారే కరవయ్యారు. దీంతో అడుగుకో గుంతపడి ప్రయాణం నరకంగా మారింది.
తెర్లాం మండలం కొత్తపేట నుంచి కొమరాడ మండలం కూనేరు వరకు దాదాపు 95 కి.మీ. మేర మరమ్మతులు చేపట్టేందుకు నిర్ణయించారు. నిధుల మంజూరుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. విశాఖ నుంచి జాతీయ రహదారి మీదుగా రామభద్రపురం వచ్చే వాహనాలు సీఆర్‌ఆర్ మీదుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లడంతో నిత్యం రద్దీగా ఉంటోంది. ఇటీవల రామభద్రపురం నుంచి కూనేరు వరకు తాత్కాలిక మరమ్మతులకు రూ.11 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపగా రూ.1.06 కోట్లు మంజూరైనా, ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. అయితే సీఆర్‌ఆర్‌ను ఆధునికీకరణ కాకుండా నిధుల సమీకరణకు టోల్ రహదారిగా మార్చేందుకు మరో ప్రతిపాదన చేశారు. దీనికి కూడా ఇంకా పూర్తిస్థాయిలో అడుగులు పడలేదు.
ఉత్తరాంధ్రలో ఎంతో కీలకమైన.. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రగతి వారధులు అయిన రెండు ప్రధాన రహదారులు అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నాయి. ఏళ్ల తరబడి అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు చేయడం.. ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించడం.. త్వరలోనే నిధులని చెప్పడం షరా మామూలైపోవడంతో కీలక మార్గాల ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలోని సీఆర్‌ఆర్, విజయనగరం- హడ్డుబంగి రోడ్ల దుస్థితి ఇది.
ఇటీవల కేంద్రం రాష్ట్రంలో 16 రహదారుల విస్తరణకు భారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లాలోనూ మూడు మార్గాల అభివృద్ధి చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు రెండు రోడ్ల ప్రగతి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో మరో కీలకమైంది విజయనగరం-హడ్డుబంగి. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా ఒడిశా రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గమిది. ఇది 20 ఏళ్లుగా అభివృద్ధి, విస్తరణకు దూరంగా ఉంది. విజయనగరం నుంచి నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, రాజాం, పాలకొండ మీదుగా హడ్డుబంగికి వెళ్లే ఈ దారి ఏపీ, ఒడిశా రాష్ట్రాలను కలుపుతోంది. ఈ మార్గానికి ఆనుకుని ఉన్న గరివిడి, నెల్లిమర్ల, గర్భాం, రాజాం, పాలకొండ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామికంగా మరింత ముందుకు సాగాలంటే ఈ దారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఇది రాష్ట్ర రహదారిగా ఉండిపోవడంతో నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది.
ముందుకు రాని గుత్తేదారులు..
గతంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో(పీపీపీ) విజయనగరం నుంచి పాలకొండ వరకు రహదారిని విస్తరించడానికి రూ.613.91 కోట్లతో అంచనాలు తయారు చేశారు. పీపీపీ విధానం కావడంతో గుత్తేదారులు టెండర్లు వేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్లు ర.భ.శాఖ డీఈఈ టి.శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం దీని విస్తరణకు ఎలాంటి ప్రతిపాదనలూ లేవన్నారు.
ఎనిమిదేళ్లుగా నిధులు రాలేదు
రహదారి మరమ్మతులకు ఎనిమిదేళ్లుగా నిధులు రాలేదు. తాజా అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేశాం. ప్రస్తుతానికి తాత్కాలికంగా గుంతలను పూడ్చే ప్రయత్నం చేస్తున్నాం. నిధులు మంజూరైతే శాశ్వత పరిష్కారం చూపుతాం. - కె.చంద్రన్, కార్యనిర్వాహక ఇంజినీరు, ర.భ.శాఖ