గుంటూరు జిల్లా భట్లూరులో ట్యూషన్‌కు వెళ్లి 17 మంది విద్యార్థులు కరోనా బారిన పడిన మరుసటి రోజే విజయనగరం జిల్లాలో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 27 మంది పిల్లలకు వైరస్ సోకిన విషయం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. గంట్యాడ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల ఉపాధ్యాయులు సహా, 73 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 19 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దత్తిరాజేరు మండలం దత్తి ఉన్నత పాఠశాలలోనూ 9,10 తరగతులకు చెందిన 100 మంది విద్యార్థులకు గత నెల 27 నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా 8 మందికి వైరస్ సోకినట్లు అధికారులు ధ్రువీకరిచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని విద్యాశాఖ జిల్లా అధికారి చెప్పారు.
మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశం
కరోనా బారిన పడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. విజయనగరం కలెక్టర్ హరిజవహర్ లాల్‌తో ఫోనులో మాట్లాడిన మంత్రి విద్యార్థుల తల్లిదండ్రులకూ కరోనా పరీక్షలు చేయించాలని సూచించారు. పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లు వినియోగించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం 9,10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతుండగా నవంబర్ 2 నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇలాంటి సమయంలో ఒకేసారి పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనాబారిన పడడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇదీ చదవండి: