విభజన అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల క్రీడా అకాడమీలను మూసివేశారు. ఆర్థిక భారం కావటం, శిక్షకుల కొరత వంటి సమస్యలతో అకాడమీల జోలికి వెళ్లలేదు. అయితే... జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం., వీటిని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చింది. తైక్వాండో, ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, షటిల్, స్లైకింగ్, జూడో, జిమ్మ్నా స్టిక్, వెయిట్ లిప్టింగ్, ఫెన్సింగ్, రైఫిల్, షూటింగ్ క్రీడలను తొలి విడతగా పరిగణలోకి తీసుకున్నారు. అయితే వీటిని బాలురు, బాలికలకు వేరువేరుగా అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు విజయనగరం జిల్లాలో ప్రాంతీయ క్రీడా పాఠశాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. విజయనగరంలోని సువిశాల క్రీడా మైదానం విజ్జీలో మొదలైన ఈ పాఠశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 70 ఎకరాలకు పైగానే విస్తరించి ఉన్న విజ్జీలో ఇప్పటికే స్కేటింగ్ రింక్, ఏసీఏ ఆధీనంలో క్రికెట్ మైదానం ఉన్నాయి. ఇవి కాకుండా త్వరలో మల్టీ పర్పస్ ఇండోర్ మైదానంతో పాటు క్రీడా పాఠశాల కూడా అందుబాటులోకి రానుంది. 6 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇండోర్ మల్టీ పర్పస్, మైదానానికి విజ్జీలో అప్పటి పాలకులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కేంద్రం 3 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ఏడాది చివరికి ప్రారంభానికి సిద్ధం చేస్తామని క్రీడా నిర్వాహకులు అంటున్నారు.
విజయనగరం ప్రాంతీయ క్రీడా పాఠశాల ఇతర భవనాల పనులు జోరందుకున్నాయి. 20 కోట్లతో చేపట్టిన పరిపాలన భవనం, బాలబాలికల వేర్వేరు వసతి గృహాలు, తరగతుల గదుల నిర్మాణాల పనులు 50 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం విజయనగరం ప్రాంతీయ క్రీడా పాఠశాల తాత్కాలిక భవనంలో కొనసాగుతోంది. పాఠశాలలోని 80మంది విద్యార్ధులను కరోనా కారణంగా వారి స్వగ్రామాలకు పంపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన భవనాలు, ఇండోర్ మైదానం అందుబాటులోకి రానుంది.
విజయనగరంలో ప్రాంతీయ క్రీడా పాఠశాల అందుబాటులోకి రావటంపై క్రీడాకారులు, క్రీడాభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పేద, మధ్యతరగతి, గ్రామీణ క్రీడాకారులకు ఈ పాఠశాల ఎంతో ఊతమిచ్చినట్లేనని సంబరపడుతున్నారు.
ఇదీ చదవండి: